చంద్రబాబుపై వైకాపా నేతల వ్యాఖ్యలను నందమూరి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. నందమూరి బాలకృష్ణ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందమూరి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఏంటన్న బాలకృష్ణ మరో సోదరి లోకేశ్వరి.. అహంభావం విడనాడాలని సూచించారు.
రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను తీసుకొస్తారా ? అని వైకాపా నేతలపై నందమూరి సుహాసిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనేశ్వరి ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని అన్నారు. రాజకీయాలు రాజకీయంగానే ఉండాలి గానీ...కుటుంబ విషయాల జోలికి తీసుకురావటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మహిళలను ఎన్టీఆర్ ఎంతో గౌరవమిచ్చారన్న సుహాసిని..నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటనను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
భువనేశ్వరి ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజలు అన్నా అని పిలుచుకుంటారు. రాజకీయాల్లో కుటుంబసభ్యులను తీసుకొస్తారా?. తెలుగువారందరూ ఖండించాల్సిన విషయం. మహిళలకు ఎన్టీఆర్ ఎంతో గౌరవమిచ్చారు.
- నందమూరి సుహాసిని
అసెంబ్లీలో లేని వ్యక్తులపై మాట్లాడతారా...
మహిళల పట్ల వైకాపా నేతలు ఎలాంటి సంస్కారంతో ఉన్నారో అందరికీ అర్థమైందని గారపాటి శ్రీనివాస్ అన్నారు. రెండేళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఒక్క అవకాశం ఇస్తే మంచి పాలన చేస్తారని అధికారంలోకి వచ్చి.. ప్రజాసమస్యలపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో లేని వ్యక్తులపై మాట్లాడతారా అని మండిపడ్డారు. చంద్రబాబు కన్నీళ్లు పెడుతుంటే చూడలేకపోయానని శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని ఎన్టీఆర్ వారసులుగా హెచ్చరిస్తున్నానన్నారు.