ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Munugodu: తెలంగాణలో రాజకీయ కాక.. మూడు పార్టీలకూ మునుగోడు సవాల్‌ - మునుగోడు సవాల్‌

Munugodu: రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన తెలంగాణ మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక మూడు పార్టీలకూ మునుగోడు సవాల్​గా మారనుంది. ఉపఎన్నికలో గెలిచేందుకు అస్త్రశస్త్రాలతో పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయి. ఈ ఎన్నికలో తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారనుంది.

Munugodu
Munugodu

By

Published : Aug 3, 2022, 1:06 PM IST

Munugodu: కాంగ్రెస్‌ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నేపథ్యంలో తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల ముందు జరగనున్న ఈ పోరును ప్రధాన పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. భాజపా అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి బరిలో దిగనుండగా తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. ఇక్కడ విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలో తాము ప్రత్యామ్నాయశక్తిగా మారాలని భాజపా భావిస్తుండగా... గత ఎన్నికల్లో కోల్పోయిన ఈ స్థానాన్ని మళ్లీ దక్కించుకోవాలని తెరాస పట్టుదలగా ఉంది. క్షేత్రస్థాయి బలంతో స్థానాన్ని నిలబెట్టుకోగలమని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. గత కొన్ని నెలలుగా మునుగోడుకు ఉప ఎన్నిక ఖాయమనే సంకేతాలు వెలువడడంతో తెరాస, కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో దిగాలనుకుంటున్న ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సమరానికి సై అంటున్న తెరాస:కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు తెరాస వ్యూహాలకు పదునుపెడుతోంది. రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరి పదవికి రాజీనామా చేస్తారని, ఉప ఎన్నికలు వస్తాయనే అంచనాతో కొంతకాలంగా తెరాస అక్కడ పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు రెండు దఫాలు సమావేశమై ఉప ఎన్నికల సన్నాహాలపై చర్చించారు. కేటీఆర్‌ కూడా వరుసగా మూడురోజుల పాటు వారితో మాట్లాడి సమాయత్తం చేశారు. నియోజకవర్గంలోని పెండింగ్‌ సమస్యలపై దృష్టి సారించారు. గట్టుప్పల్‌ మండలాన్ని ప్రకటించారు. మరోవైపు నియోజకవర్గంలోని బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్‌లలో ఓటమి పాలైన నేపథ్యంలో మునుగోడులో గెలుపును పార్టీ కీలకంగా భావిస్తోంది. ఆ నియోజకవర్గాల్లో ఎదురైన అనుభవాలను గుణపాఠంగా తీసుకొని ముందుకు సాగాలని భావిస్తోంది. అభ్యర్థి ఎంపిక, ప్రచారం. అంచనాలు తదితర అంశాలపై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. ఏమాత్రం హడావుడి చేయకుండా పకడ్బందీగా ముందుకు సాగాలనే సంకల్పంతో ఉంది. 2018 శాసనసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి ఓడిపోయినా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అయిదింటిలో తెరాస ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులున్నారు. రెండు పురపాలికల్లో తెరాస పాలకవర్గాలే ఉన్నాయి. నియోజకవర్గంలో గత మూడేళ్లుగా జరుగుతున్న సర్వేలకు తోడు తాజాగా ప్రశాంత్‌కిశోర్‌ బృందం సర్వేలు నిర్వహించి నివేదికలు ఇచ్చింది. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడైన అమిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, పార్టీ నేతలు కర్నాటి విద్యాసాగర్‌, కంచర్ల కృష్ణారెడ్డి, మరో బీసీ నాయకుడు రవితో పాటు కొత్తగా మరికొందరు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

పట్టు సడలకూడదంటున్న కమలదళం: :

దుబ్బాక, హుజూరాబాద్‌లలో వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్న కాషాయదళం ఈ ఉప ఎన్నికలో కూడా గెలిచి రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని భావిస్తోంది. ఇక్కడ విజయం సాధించి రాష్ట్రంలో తెరాసకు తామే ప్రత్యామ్నాయమన్న సంకేతాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని భాజపా నాయకులు ఆశిస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌లా కాకుండా అగ్రనేతలు సహా పార్టీ తన బలాలు, బలగాల్ని ప్రచారానికి దించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కొద్దిరోజుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరడం... పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయం కానుంది. ఈ నియోజకవర్గంలో భాజపా గతంలో ఎప్పుడూ కనీసం రెండోస్థానంలో కూడా సాధించలేదు. గంగిడి మనోహర్‌రెడ్డి 2009, 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడినుంచి భాజపా అభ్యర్థిగా పోటీచేసినా మూడో స్థానానికి పరిమితమయ్యారు. పార్టీకి ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు, నలుగురు సర్పంచులు, చౌటుప్పల్‌లో ముగ్గురు, చండూరులో ఒక కౌన్సిలర్‌ మాత్రం ఉన్నారు. గత ఆరు నెలలుగా సంస్థాగతంగా బలోపేతంపై భాజపా నేతలు దృష్టిసారించారు. 300 పోలింగ్‌ బూత్‌లకు కమిటీలు వేశారు. నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా ఉన్నా కోమటిరెడ్ది రాజగోపాల్‌రెడ్డి రూపంలో బలమైన అభ్యర్థి కానున్నారు. రాజగోపాల్‌రెడ్డి వెంట కాంగ్రెస్‌ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు రావడం కీలకంగా మారనుంది.

కాంగ్రెస్‌ అగ్రనేతలకు గెలుపు కీలకం:సిట్టింగ్‌ స్థానం కావడంతో పాటు... పార్టీ కీలక నేతలు ఉన్న జిల్లా కావడంతో కాంగ్రెస్‌కు ఈ ఉప ఎన్నికలో విజయం కీలకంగా మారనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి... టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.జానారెడ్డిలకు ఈ ఎన్నిక బాధ్యతను కాంగ్రెస్‌ అధిష్టానం అప్పగించింది. తాజాగా ఏర్పాటుకానున్న గట్టుప్పల్‌ మండలం సహా మొత్తం ఏడు మండలాల్లో సంస్థాగతంగా తమ పార్టీకి ఉన్న బలంపై నేతలు నమ్మకంగా ఉన్నారు. అభ్యర్థి ఎంపిక మాత్రం సవాల్‌గానే మారనుంది. గతంలో మునుగోడుకు అయిదు సార్లు ప్రాతినిథ్యం వహించిన పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కుమార్తె స్రవంతి సహా పలువురు నేతలు కాంగ్రెస్‌ టికెట్‌ రేసులో ఉన్నారు.

2018 తర్వాత అయిదో ఉప ఎన్నిక: రాష్ట్రంలో 2018 శాసనసభ ఎన్నికల అనంతరం అయిదో ఉపఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపి ఆమోదం పొందాల్సి ఉంది. తర్వాత ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇస్తే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటివరకు శాసనసభ ఎన్నికల అనంతరం నాలుగు ఉప ఎన్నికలు జరగ్గా రెండింటిలో తెరాస, మిగిలిన రెండింటిలో భాజపా విజయం సాధించాయి. కాంగ్రెస్‌ ముఖ్యనేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా ఎన్నిక కావడంతో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో హుజూర్‌నగర్‌కు జరిగిన ఉపఎన్నికలో తెరాసా విజయం సాధించింది. తెరాస ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలిచారు. తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో జరిగిన నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి నోముల భరత్‌ గెలుపొందారు. శాసనసభ సభ్యత్వానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా చేయడంతో జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా బరిలోదిగిన ఆయనే విజయం సాధించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details