ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంపీ విజయసాయిరెడ్డి భూదోపిడీ... కోడై కూస్తోన్న విశాఖ..!

Vijayasai Reddy land scam: సాయిరెడ్డి భూదోపిడీ చేశారని విశాఖ నగరం కోడై కూస్తోంది. వైకాపా ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి హోదాను అడ్డుపెట్టుకుని రాజ్యాంగేతర శక్తిలా రెచ్చిపోయిన కాలంలో భూ లావాదేవీలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయన్నది నిఖార్సైన నిజం. అదే అదునుగా ఆయన కుమార్తె, అల్లుడి కంపెనీ... మార్కెట్ ధర కంటే మూడో వంతు తక్కువకే భూములు కొనడం అక్షర సత్యం. భోగాపురం బీచ్ కారిడార్ మొదలైతే వారి భూముల విలువ రెట్టింపు కానుండగా విశాఖకు పాలనా రాజధాని వస్తే మూడింతలు కావడం ఖాయం. ఇదంతా తెలిసికూడా పెళ్లి చేసుకుని వెళ్లిన కుమార్తె ఆస్తులతో నాకేంటి సంబంధమని అమాయకంగా ప్రశ్నిస్తూ జనం చెవిలో పూలు పెట్టాలని చూస్తే ఎలా సాయిరెడ్డి..?

vijayasai reddy
సాయిరెడ్డి భూదోపిడీ

By

Published : Oct 17, 2022, 8:37 AM IST

Updated : Oct 17, 2022, 10:24 AM IST

సాయిరెడ్డి భూదోపిడీ

Vijayasai Reddy land scam: ఇదీ.. విశాఖ జిల్లా భీమిలి మండలంలో కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాన్‌ రియల్టర్స్‌ భారీగా భూములు కొన్న వ్యవహారంపై.. విలేకర్ల సమావేశంలో విజయసాయిరెడ్డి స్పందించిన తీరు. ఆ ప్రెస్‌మీట్‌లో ఆయన నోటి నుంచి ఇలాంటి ఆణిముత్యాలెన్నో జాలువారాయి. అయితే.. సాయిరెడ్డి కుమార్తె, అల్లుడి కంపెనీ 87వేల 714 చదరపు గజాల విస్తీర్ణమున్న 25 స్థలాల్ని కేవలం 11 నెలల వ్యవధిలోనే.. 51.87 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. బహిరంగ మార్కెట్‌లో ఇప్పటి ధరల ప్రకారం ఆ భూముల కనీస విలువ 177 కోట్లకు పైనే..! తన అల్లుడి కుటుంబం 40 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తోందని, వాళ్లకు 100 దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయని గొప్పలు చెప్పిన సాయిరెడ్డి... వాళ్లు బడా వ్యాపారవేత్తలు అయినంత మాత్రాన.., కోరుకున్న ప్రాంతంలో.., బహిరంగ మార్కెట్‌ ధరలో మూడో వంతు కంటే తక్కువకే ఎలా భూములు ఇచ్చేస్తారో కూడా చెబితే బాగుండేది. ఈ భూదందాలో.. ఉత్తరాంధ్రకు సామంతరాజులా వ్యవహరించిన తన ప్రమేయం ఎంతమాత్రమూ లేదని సాయిరెడ్డి చెబితే... జనం ఎలా నమ్మేస్తారు..?

విజయసాయిరెడ్డి గురించి తెలిసినవారు, వైకాపా ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి హోదాలో దాదాపు సమాంతర ప్రభుత్వాధినేతలా చలాయించిన అసాధారణ అధికారాల్ని చూసినవాళ్లలో ఒక్కరైనా... ఆయన మాటల్ని నమ్మే అవకాశం లేదు. పేరుకు పార్టీ ఇన్‌ఛార్జే అయినా... ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల్ని డమ్మీలుగా మార్చేసి.. రాజ్యాంగేతరశక్తిలా వ్యవహరించారు. అధికార పార్టీలో నెంబర్‌-2గా అపరిమితమైన అధికారాల్ని అనుభవించారు. ఆయన ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడు.... కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు ఎవరైనా సరే... సాయిరెడ్డి కనుసన్నల్లో పనిచేయక తప్పేది కాదు. వాళ్లంతా ఆయనకే రిపోర్ట్ చేయాల్సిన దుస్థితి ఉండేది. ఉత్తరాంధ్రలో హవా నడిచినంత కాలం భూముల వ్యవహారాలన్నీ విజయసాయి కనుసన్నల్లోనే సాగాయి. మరీ ముఖ్యంగా విశాఖలో సాయిరెడ్డి హవా మామూలుగా ఉండేది కాదు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఆయనగారి ముందు జీహుజూర్‌ అనాల్సిందే. గిట్టనివారు, దారికిరానివారు, ప్రతిపక్ష నాయకుల ఆస్తులపై ఎలా దాడులు చేయించారో, నిర్మాణాల్ని ఎలా కూలగొట్టించారో ప్రజలందరికీ తెలిసిందే. సాయిరెడ్డి చక్రం తిప్పినంత కాలం... దశాబ్దాల రాజకీయ అనుభవమున్న సీనియర్‌ మంత్రుల మాటల్ని కూడా అధికారులు ఖాతరు చేసేవారు కాదు. సీఐ నుంచి డీఐజీ వరకు.., తహసీల్దార్‌ నుంచి కలెక్టర్‌ వరకు..., ఎవరి బదిలీ అయినా విజయసాయి చెప్పినట్లు జరగాల్సిందే. భూలావాదేవీలు సహా కీలక దస్త్రాలపై అధికారులు సంతకం పెట్టింది కూడా ఈయన అనుమతితోనే.! అలాంటిది సాయిరెడ్డి కుమార్తె, అల్లుడికి చెందిన కంపెనీ.... ప్రతిపాదిత భోగాపురం బీచ్‌ కారిడార్‌ రోడ్డు పక్కన అత్యంత విలువైన భూములను బహిరంగ మార్కెట్‌ విలువ కంటే తక్కువకు కొనేస్తే.. అందులో ఆయన ప్రమేయం ఏమాత్రం లేదని చెబితే ప్రజలు నమ్ముతారా..?

ఉత్తరాంధ్రను కబంధ హస్తాల్లో బంధించి ఉక్కిరిబిక్కిరి చేయకపోయి ఉంటే.., ప్రజల్ని బెదిరించి, భయపెట్టి, మభ్యపెట్టి, తీవ్ర ఒత్తిడికి గురిచేయనట్లయితే... అంత తక్కువ ధరకు భూముల్ని ఎందుకు ఇచ్చేస్తారు..?.. పోనీలే అని తక్కువ ధరకు ఇవ్వడానికి... సాయిరెడ్డి కుమార్తె, అల్లుడేమైనా సమాజసేవ కోసం భూములు కొన్నారా..? విశాఖలోని ఒక ప్రముఖ విద్యాసంస్థ... ప్రభుత్వ భూమిని ఆక్రమించిందంటూ అధికారుల్ని దండయాత్రలా పంపించారు. గోడ పగలగొట్టి కంచె వేయించారు. ఇప్పుడు అదే విద్యాసంస్థ యాజమాన్యంలోని మరో సంస్థ... అత్యంత విలువైన భూముల్ని సాయిరెడ్డి కుమార్తె, అల్లుడి కంపెనీకి తక్కువ ధరకే ఎలా ఇచ్చేసిందో జవాబు చెప్పాలని విశాఖకు చెందిన ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే పూర్తి పారదర్శకంగా అంతా జరిగి ఉంటే... అవ్యాన్‌ కంపెనీ భూములు ఎలా కొన్నది.., ఎంతకు కొన్నది.., నేరెళ్లవలస, భీమిలి ప్రాంతంలోనే అన్ని భూములు ఎందుకు కొనిందనే విషయాలు చెప్పకుండా... విలేకర్ల సమావేశంలో సమాధానాలు ఎందుకు దాటవేశారో సాయిరెడ్డిగారు చెబితే బాగుంటుంది. విలువైన భూముల్ని మార్కెట్‌ ధర కంటే తక్కువకే సాయిరెడ్డి కుమార్తె, అల్లుడి కంపెనీకి ఇచ్చేశారంటే... ఈయన బెదిరించైనా తీసుకుని ఉండాలి. లేకపోతే ఎక్కువ ధరకే కొని స్టాంప్‌ డ్యూటీ ఎగ్గొట్టడానికి తక్కువ రేటుకు కొన్నట్లు చూపించి ఉండాలి. అదీ కాదంటే.. మిగతా డబ్బులను బ్లాక్‌లో భూయజమానులకు ముట్టజెప్పి ఉంటారని ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ చుట్టుపక్కల భూయజమానుల్ని భయపెట్టో, బెదిరించో విజయసాయిరెడ్డి కుమార్తె ఎడాపెడా భూములు కొనేశారని... ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. ఆ భూముల స్వాధీనానికి సాయిరెడ్డి మనుషులు ఓ గెస్ట్‌హౌస్‌లో కూర్చుని పన్నాగాలు పన్నుతారని.., డీపట్టా భూముల్ని, 22A కేటగిరీ భూముల్నీ కూడా కొన్నారని ఆరోపించారు. ఇది చాలదా సాయిరెడ్డి ఎంతటి ఘనులో చెప్పడానికి..?

సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, అల్లుడు రోహిత్‌రెడ్డి డైరెక్టర్లుగా 2020 సెప్టెంబర్ 7న ఏర్పాటైన అవ్యాన్‌ రియల్టర్స్‌ సంస్థ... 2021 ఫిబ్రవరి 19 నుంచి డిసెంబర్ 17 మధ్య భీమిలి, నేరెళ్లవలసలో 25 స్థలాలు కొనుగోలు చేసింది. చదరపు గజం 15 వందల నుంచి గరిష్ఠంగా 8 వేలకు కొన్నట్లు రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో ఉంది. వారు భూములు కొన్న ప్రాంతాన్ని పరిశీలించిన ఈనాడు - ఈటీవీ... భూముల విలువ ఎంతుందో స్థానికులు, స్థిరాస్తి వ్యాపారులను ఆరా తీశాయి. అవ్యాన్‌ కొన్నట్టుగా చెబుతున్న ధరకు మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నట్టుగా తేలింది. ఉదాహరణకు సర్వే నెంబర్ 30/7లో 7వేల 405.2 చదరపు గజాల స్థలాల్ని... చదరపు గజం 6వేల 500 చొప్పున కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. అంటే 4.81 కోట్లకు భూమి కొన్నట్లు చూపించారు. బహిరంగ మార్కెట్‌లో చదరపు గజం విలువ ప్రస్తుతం 20 వేలకు పైనే ఉంది. ఆ లెక్కన సదరు భూమి విలువ 14.81 కోట్లు.

సాయిరెడ్డి కుమార్తె, అల్లుడు కొన్న భూముల పక్క నుంచే ప్రతిపాదిత భోగాపురం బీచ్‌ కారిడార్‌ రోడ్డు వస్తోంది. ఆ పనులు మొదలైతే అవ్యాన్‌ భూముల ధరలు ఒక్కసారిగా రెట్టింపవుతాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్నట్లు విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తే... అవ్యాన్‌ భూములు కొన్న ప్రాంతానికి సమీపంలోనే కోర్‌ కేపిటల్‌ వస్తుంది. అప్పుడు ఆ భూముల ధరలు మరో రెండు మూడు రెట్లు పెరగడం ఖాయం. దీన్నే కదా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటారు..! విశాఖలో చేయాల్సిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసేసి... రాజకీయ ప్రత్యర్థులపై నిందలు వేయడం భావ్యమా అన్నది సాయిరెడ్డి గారే చెప్పాలి.

ఇవీ చదవండి:

Last Updated : Oct 17, 2022, 10:24 AM IST

ABOUT THE AUTHOR

...view details