ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సరైన అర్థాన్ని మంత్రులు తెలుసుకోవాలని రాజధాని రైతులు సూచించారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే... వైకాపా సర్కార్ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అవినీతి జరిగిందని ఆరోపించడం మాని నిరూపించాలని అన్నారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం 277వ రోజూ కొనసాగింది.
ఇన్సైడర్ ట్రేడింగ్‌కు మంత్రులు అర్థం తెలుసుకోవాలి: అమరావతి రైతులు - అమరావతి రైతుల ఆందోళన తాజా వార్తలు
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు 277వ రోజు నిరసన కొనసాగించారు. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు పాలకులు రోజుకోమాట మారుస్తున్నారని విమర్శించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
తుళ్లూరు, మందడం, వెలగపూడి, నీరుకొండ, ఎర్రబాలెం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, అబ్బరాజుపాలెం, బోరుపాలెంలో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళలు గీతా పారాయణం, దైవారాధన వంటి పూజా కార్యక్రమాలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని పూజలు నిర్వహించారు. లింగాయపాలెంలో హనుమాన్ చాలీసా పఠించారు. అబ్బరాజు పాలెంలో గోవింద నామస్మరణంతో నిరసన తెలియజేశారు. కృష్ణాయపాలెంలో రైతులు రహదారిపైకి వచ్చి మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. కళ్లకు గంతలు కట్టుకొని అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.