జగనన్న పచ్చతోరణంలో గ్రామాల్లో నాటే మొక్కల్లో 83 శాతం సంరక్షించకపోతే అందుకు సర్పంచులను బాధ్యులుగా చేసి అనర్హత వేటు వేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టంలో ఇప్పటికే సవరణలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జగనన్న పచ్చతోరణంపై నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలను విజయవాడలో మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఇతర ప్రభుత్వశాఖల అధికారులు గ్రామీణాభివృద్ధిశాఖకు డిప్యుటేషన్‌పై వచ్చి కాలయాపన చేస్తూ కార్యక్రమాన్ని చెడగొట్టవద్దని మంత్రి హెచ్చరించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహించే అధికారులపైనా చర్యలు తప్పవని, అదే సమయంలో సంరక్షణలో రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచే అధికారులకు ముఖ్యమంత్రితో సన్మానం చేయిస్తామని పెద్దిరెడ్డి ప్రకటించారు.గ్రామాల్లో ఏటా మొక్కలు నాటుతున్నా వాటి సంరక్షణపై నిర్లక్ష్యం కారణంగా అవి బతకడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మొక్కల పెంపకంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు జిల్లా అధికారులు వెళ్లి చూడాలని సూచించారు. జగనన్న పచ్చతోరణంలో గ్రామాల్లో ఈ ఏడాది కోటి మొక్కలు నాటాలని ఆదేశించారు. వచ్చే 2 నెలల్లో జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఎక్కడైనా మొక్కల సంరక్షణ ఏర్పాట్లు సంతృప్తికరంగా లేకుంటే చర్యలు తప్పవన్నారు. గ్రామాల్లో మొక్కలు నాటేందుకు వచ్చే నెల 15 నుంచి 31 వరకు పక్షోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ గిరిజా శంకర్ చెప్పారు.