Ktr At Safran Facility: రాష్ట్రంలో పరిశ్రమ వర్గాలతో కలిసి ఏరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శంషాబాద్‌లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ ఎమ్ఆర్వో ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్న కేటీఆర్.. సాఫ్రాన్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జాతీయంగా ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. మూడో పెద్ద ప్రాజెక్టుగా ఎంఆర్ఓ ఫెసిలిటీని ప్రకటించడం సంతోషకరంగా ఉందన్నారు.
హైదరాబాద్ దేశంలోనే ఉత్తమ ఏరోస్పేస్ వ్యాలీగా మారుతోందని కేటీఆర్ అన్నారు. టీఎస్ ఐపాస్ రూపంలో మెగా ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్, దిల్లీ, ప్యారిస్‌లో 35 సమావేశాలు... 400కు పైగా మెయిల్స్, నాలుగేళ్ల నిరంతర శ్రమ కారణంగానే సాఫ్రాన్ సంస్థ భారీ పెట్టుబడులు సాధ్యమయ్యాయని వివరించారు. హైదరాబాద్ ఏరోస్పేస్, ఏవియేషన్ ఎకోసిస్టం రోజురోజుకూ వృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు.
2025లో ఎంఆర్‌ఓ పూర్తయితే ప్రపంచలోనే అతిపెద్దదిగా నిలుస్తుంది. ఇది దేశానికే గర్వకారణం. హైదరాబాద్‌లో ఎంఆర్‌ఓ ఏర్పాటు చేసి సాఫ్రాన్ సంస్థ పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించింది. దక్షిణాసియాలోని చాలా విమానరంగ సంస్థలు ఈ సౌకర్యాలను ఉపయోగించుకుంటాయని నమ్ముతున్నాను. ఏరోస్పేస్ రంగంలో ఈ పెట్టుబడులు చాలా మార్పులు తెస్తాయని భావిస్తున్నాను. ఇది ఇతర విమాన, రక్షణరంగ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. హైదరాబాద్ ప్రపంచంలోని ప్రత్యేకమైన టెక్నాలజీ హబ్‌గా రూపొందింది. ఇక్కడున్న పెట్టుబడిదారులే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు. వారు సంతోషంగా ఉంటే వ్యాపారాన్ని విస్తరిస్తుంటారు. రాష్ట్రంలో వ్యాపార అవకాశాలను ప్రపంచం నలుమూలలా చాటుతుంటారు. -కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, తెలంగాణ
వేలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏరోస్పేస్, ఏవియేషన్ రంగాలకు అనుసంధానమయ్యాయని మంత్రి కేటీఆర్ వివరించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ నుంచి హైదరాబాద్ నిరంతరం అవార్డులు పొందుతోందని, జీఎంఆర్ చేపట్టిన టెర్మినల్ విస్తరణ డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్‌కు అనుగుణంగా మరిన్ని టెర్మినల్స్ కూడా అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి యూరప్, యూఎస్‌కు మరిన్ని డైరెక్ట్ ఫైట్స్ నడుపుతామన్న హమీ నెరవేర్చాలని కేంద్ర పౌరవిమానయాన శాఖను కేటీఆర్ కోరారు.
ఇవీ చదవండి: