బలహీనవర్గాల ముసుగులో ఉన్న పెద్దదొర ఈటల అని.. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఈటల హుజూరాబాద్‌లో ఉంటే బీసీ.. హైదరాబాద్‌లో ఉంటే ఓసీ అని పేర్కొన్నారు. ఈటల ఎప్పుడైనా ముదిరాజుల సమస్యలపై మాట్లాడారా? అని ఆరోపించారు. బలహీనవర్గాల గురించి ఒక్క రోజు అయినా ఈటల మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. ముదిరాజులకు చేప పిల్లలు కావాలని ఎప్పుడైనా సీఎంను కోరారా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో తెలంగాణ వాదులను తొక్కిపెట్టారని ఆరోపించారు. తక్కువ సమయంలో వేల కోట్లు ఎలా సంపాదించారని నిలదీశారు.
కేసీఆర్ ఒక లెజెండ్... ఒక శక్తి
ఈటలను సొంత సోదరుడిలా భావించి కేసీఆర్ ఆదరించారని గంగుల తెలిపారు. పార్టీలో తిరుగుబాటు తెచ్చేందుకు ఈటల ప్రయత్నించారని ఆరోపించారు. ఎక్కడైనా తెరాస ఓడిపోతే ఈటల సంతోషించే వారని చెప్పారు. హుజూరాబాద్‌లో తెరాస చాలా బలంగా ఉందని ఉద్ఘాటించారు. అక్కడ ఈటలను చూసి తెరాసను గెలిపించలేదని.. కేసీఆర్ ఫొటోను చూసే ప్రజలు ఓటేశారని స్పష్టం చేశారు. ఆ స్థానంలో ఈటల ఎన్నిసార్లు గెలిచినా కేసీఆర్‌దే ఘనతే అన్నారు. కేసీఆర్ ఒక లెజెండ్.. ఒక శక్తి అని కొనియాడారు. త్వరలోనే హుజూరాబాద్‌లో పర్యటిస్తామని చెప్పారు.