Bosta comments on ap capital: ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదేనని, బహుశా దాన్ని ఆధారంగా చేసుకునే న్యాయస్థానాలు మాట్లాడి ఉంటాయని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘ప్రభుత్వం దృష్టిలో అమరావతి శాసన రాజధాని మాత్రమే. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఈ తీర్మానానికి దిల్లీ ఆమోదం తీసుకున్నారా? చట్ట ప్రకారం చేశారా? అంటే అలాంటిదేదీ జరగలేదు. అందువల్ల విభజన చట్టం ప్రకారం 2024 వరకు మన రాజధాని హైదరాబాదే. రాజధానిని మేం గుర్తించాక పార్లమెంట్‌కు పంపి అక్కడ ఆమోదం పొందాక చట్ట సవరణ చేయాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని మంత్రి అన్నారు. ‘చట్టాలు చేయడానికే శాసనసభ, పార్లమెంట్ ఉన్నాయి. ఈ చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉండాలి. చట్టాలు చేయకూడదని శాసనసభ.. పార్లమెంట్‌ని... తీర్పు ఇవ్వకూడదని న్యాయస్థానాన్ని... అంటే మన వ్యవస్థలు ఎక్కడ ఉన్నట్లు? ఎవరి పని వారు చేయాలి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చట్టాలు చేస్తే జోక్యం చేసుకోడానికి న్యాయస్థానాలు ఉంటాయి. రాజధాని విషయంలో తీర్పు వెలువడిన రోజునే ఇది చర్చనీయాంశమైన అంశమని చెప్పాను. చిన్నచిన్న లోటుపాట్లు వచ్చినప్పటికీ.. కోర్టులపై మాకు అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి’ అని బొత్స వివరించారు.
31లోపు అన్ని విషయాలూ తెలుస్తాయి కదా!