ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్ఛను సద్వినియోగ పరుచుకుంటూ... ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ప్రజాస్వామ్యంలో మూలస్తంభంగా పత్రికలు, జర్నలిస్టులు పోషిస్తున్న పాత్ర అవిస్మరణీయమని ఆయన అన్నారు. నిజం, నిష్పాక్షికత, కచ్చితత్వం, జవాబుదారీతనం, న్యాయబద్ధత, నైతికత, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి మూలసూత్రాలకు మీడియా కట్టుబడి ఉండాలన్నారు.
కరోనాపై జర్నలిస్టులు ముందువరసలో ఉండి పోరాటం చేయడం అభినందనీయమని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ప్రజాసంక్షేమంతోపాటు దేశాభివృద్ధిలో మీడియా భాగస్వామి కావాలని సూచించారు. వ్యవసాయరంగం, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అలాగే జర్నలిస్టుల బాధ్యత, పత్రికాస్వేచ్ఛకు సంబంధించి ప్రముఖులు చెప్పిన మాటలను ఆయన ట్వీట్ చేశారు.