తెలంగాణలో సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్‌ఐసీసీలో మహిళా సాధికారత సదస్సు జరుగుతోంది. కార్యక్రమంలో పాల్గొన్న మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ మహిళా సాధికారతపై ప్రసంగించారు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ఆమె తెలిపారు. భయమే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలని.. .అది వారి వ్యక్తిత్వాన్ని వివరించేలా ఉండాలన్నారు.
భయపడే వారు ఎప్పటికీ విజయం సాధించలేరు: శైలజాకిరణ్
రేపటి గురించి ఎక్కువగా భయపడొద్దని... ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరుగుతోన్న మహిళా సాధికారత సదస్సులో ఆమె పాల్గొన్నారు. తన ప్రసంగంలో మహిళా వ్యాపారవేత్తలకు పలు సూచనలు చేశారు.
విజయాల్లో భాగస్వాములకు కూడా గుర్తింపు ఇవ్వాలని శైలజాకిరణ్ అన్నారు. ఎల్లప్పుడూ సరైన నిర్ణయం తీసుకోవాలని... ఒకవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా వాటిని పునరావృతం చేయకూడదని తెలిపారు. వృత్తిలో బలమైన వర్క్ ఎథిక్స్ ఉండాలన్నారు. అప్పుడే వ్యాపారం తప్పక అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు. వినియోగదారుడి అవసరాలకు తగినట్టు సేవలు అందించాలని మహిళా వ్యాపారవేత్తలకు సూచించారు. మీ వ్యాపారం ఎంత వృద్ధి చెందింది అని కాకుండా... సమాజానికి దాని ద్వారా ఎంత మంచి జరిగిందనేది ఆలోచించాలని అన్నారు.