రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. స్వల్ప ఓట్ల తేడా వచ్చిన పంచాయతీల్లో.. పరాజితులు రీ కౌంటింగ్ కు పట్టుబడుతున్నారు. కొన్ని చోట్ల రీ కౌంటింగ్ తర్వాత విజేతలు మారుతుండడం.. వివాదాస్పదం అవుతోంది. ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కృష్ణా జిల్లాలో..
ఎ. కొండూరు మండలం వల్లంపట్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓట్ల లెక్కింపు అనంతరం మొదట తెదేపా మద్దతుదారు గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మరి కాసేపటికే వైకాపా మద్దతుదారు గెలిచినట్లు ప్రకటింటంతో.. తెదేపా వర్గం రీ పోలింగ్ జరపాలని ధర్నాకు దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు చేరుకున్నారు.
గుంటూరు జిల్లాలో..
అమరావతి వైకుంఠపురంలో రెండు ఇరువర్గాల మధ్య ఆందోళన జరిగింది. తెదేపా మద్దతిచ్చిన అభ్యర్థి విఠల్ రావు 17 ఓట్లతో విజయం సాధించారు. రీకౌంటింగ్ చేయాలని వైకాపాకు చెందిన రామారావు వర్గం ఆందోళన చేపట్టారు. తెదేపా వర్గం నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు.
ప్రత్తిపాడు నియోజకవర్గం ఈదులపాలెంలో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఒక అభ్యర్థి 14 ఓట్లతో విజయం సాధించనట్లు ప్రకటించడం ఉద్రిక్తతలకు దారితీసింది. పెదనందిపాడు మండలం పుసులూరులో తెదేపా బలపరిచిన సర్పంచి అభ్యర్థి 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టు ప్రకటించడం వివాదానికి కారణమైంది. ప్రత్యర్థి అభ్యర్థులు రీ కౌంటిగ్కు డిమాండ్ చేస్తూ కౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించారు. వైకాపా మండల కన్వీనర్ వెళ్లడంతో మరింత ఆందోళన పెరగగా.. పోలీసులు స్పందించాల్సి వచ్చింది.
విశాఖ జిల్లాలో..
ఆనందపురం మండలం గండిగుండం పంచాయతీలో ఓటమిపాలైన అభ్యర్థి వర్గం ఆందోళన చేశారు. జి.శ్రీను అనే వ్యక్తిని తన సమీప అభ్యర్థి జి.రమేశ్ పై 21 ఓట్ల తేడాతో సర్పంచ్‌గా విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. రమేశ్‌కు వచ్చిన 36 ఓట్లలో వేలిముద్రలు ఉన్నాయని.. వాటిని చెల్లని ఓట్లుగా పరిగణిస్తున్నట్టు అధికారులు ప్రకటించటంతో ఆందోళన చేపట్టారు. గెలిచిన అభ్యర్థి శ్రీనుకు ఎన్నికల అధికారులు సహకరించారని ప్రత్యర్ధి వర్గం ఆరోపించారు.
నెల్లూరు జిల్లాలో..
ముత్తుకూరు మండలం పైనాపురంలో ఉద్రిక్తత మధ్య రీ కౌంటింగ్ కొనసాగింది. ఇండిపెండెంట్ అభ్యర్థి విజయకుమార్ రెండు ఓట్లతో గెలుపొందారు. రెండోసారి జరిపిన లెక్కింపులో విజయకుమార్ మూడు ఓట్ల ఆధిక్యం వచ్చింది. మూడోసారి జరిపిన లెక్కించగా.. రెండు ఓట్లు మెజార్టీతో విజయకుమార్ గెలిచారు.
చిత్తూరు జిల్లాలో..
పాకాల పంచాయతీ పోటీలో నిలిచిన ప్రియాంజలి, కస్తూరి గీత మధ్య హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో చివరికి కస్తూరి గీత ఒక్క ఓటు మెజారిటీతో గెలిచిందనట్టు ఎన్నికల అధికారులు ప్రకటడంతో ఉద్రిక్తత నెలకొంది. రీకౌంటింగ్‌కు అవకాశం ఉన్నప్పటికీ.. ఆర్ఓ అందుకు ఒప్పుకోకుండా కస్తూరి గీత గెలిచినట్లు ప్రకటించడం వివాజదానికి కారణమైంది. పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చివరికి చంద్రగిరి నియోజకవర్గ బాధ్యులు పులివర్తి నాని ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ఆర్ఓ, ఇన్చార్జీలపై చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని నాని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
పల్లె పోరు: తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు