భద్రాచలంలో వైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం
Sri Rama Navami in Bhadradri : రామనామస్మరణతో భదాద్రి మారుమోగింది. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాద్రిలోని సీతారామ చంద్రస్వామి దివ్యక్షేత్రంలో సాగుతున్న... తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రాములోరి కల్యాణం కనులపండువగా సాగింది. కొవిడ్ ప్రభావంతో రెండేళ్లు సాదాసీదాగా జరిగిన రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించి భక్తులు పునీతులయ్యారు. మిథిలా మైదానంలో సుందరంగా ముస్తాబైన మండపానికి వేదమంత్రోచ్ఛరణ నడమ దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చారు.
తానీషా కాలం నాటి నుంచి కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాఠోడ్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, ఆభరణాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
రక్షాబంధనం కట్టి:తిరుకల్యాణానికి సంకల్పం పలికి సర్వవిజ్ఞాన శాంతికి... విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. ఆ తర్వాత కల్యాణానికి ఉపయోగించే సామగ్రికి సంప్రోక్షణ తర్వాత... రక్షాబంధనం నిర్వహించి యోక్త్రధారణ చేశారు. అందులో యోక్త్రధారణ.. కడురమనీయంగా సాగింది. దర్బలతో ప్రత్యేకంగా అల్లినతాడుని... సీతమ్మవారి నడుముకి బిగించారు. దీన్ని యోక్త్రధారణగా పండితులు వివరిస్తారు. సీతారాములకు రక్షాబంధనం కట్టి.. స్వామి గృహస్త ధర్మం కోసం యజ్ఞోపవితరణ చేసి తాంబూలాది సత్కారాలు, కన్యావరుణ నిర్వహించి... తాంబూలాది సత్కారాలు అందించారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయించి... ఇరువంశాల గోత్రాలు పఠించారు. స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు.
భక్తులందరికీ:వధూవరులకు మంగళం చేకూర్చాలనే భావనతో అందించే... ఆ ఆశీస్సులు కల్యాణం వీక్షించే భక్తులందరికీ వర్తించేలా ఉంటాయి. కల్యాణ వైభవాన్ని చాటిచెప్పేలా... చూర్ణికను పఠించారు. వేదమంత్రోచ్చరణాలు మారుమోగుతుండగా జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. ఇది శుభ ముహూర్తం. జగత్ కల్యాణ శుభసన్నివేశం. ఆ కమనీయ వేడుకను కనులారా వీక్షించి భక్తులు తన్మయత్వం పొందారు. ఉదయం పదిన్నర గంటలకు... కల్యాణ మహోత్సవ క్రతువు మొదలుకాగా సరిగ్గా అభిజిత్ లగ్నంలో స్వామివారు.. సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేశారు. రాత్రికి స్వామివారు, అమ్మవారు.. చంద్రప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. రేపు శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవం జరగనుంది.
ఇదీ చదవండి :రమణీయం.. కమణీయం.. బియ్యం గింజలపై రామనామం