ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Covid Deaths: కరోనా కాలం.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం! - అనుబంధ వ్యాధులు

కరోనాతో సంభవించిన మరణాల్లో ఎక్కువ శాతం మంది ఇతర వ్యాధులతో మృతి చెందిన వారేనని... 2019-20 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొంది. రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని యువతలో పలు వ్యాధులు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తేలింది. మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, రక్తహీనతతో సహా పలు సమస్యలున్న వారిపై కొవిడ్​ వైరస్‌ తీవ్ర ప్రభావం చూపినట్లు సర్వే వెల్లడించింది. అందుకు యువత ఆహారం, ఆరోగ్యం విషయంలో రోజూ వారి జీవన శైలి మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

National Family Health Survey
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే

By

Published : Jun 24, 2021, 4:27 PM IST

కొవిడ్‌ మరణాల్లో ఎక్కువ శాతం మంది అనుబంధ వ్యాధులతో చనిపోయిన వారే. మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, రక్తహీనత తదితర సమస్యలున్న వారిపై వైరస్‌ తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా వెలువడిన 2019-20 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(National Family Health Survey) ఇదే తేటతెల్లం చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో యువతలో జీవనశైలి సమస్యలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి.

15-49 ఏళ్ల మధ్య స్త్రీ, పురుషులు అధిక రక్తపోటు, మధుమేహం ఇతర అనుబంధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి కరోనా సోకితే అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందే మేల్కొని వీటిని నియంత్రణలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మహిళలను అధిక బరువు సమస్య వేధిస్తోంది. ఈ మూడు జిల్లాల పరిధిలో 40-51 శాతం మందిని ఇది ఇబ్బంది పెడుతోంది.

మహిళల్లో వచ్చే సహజ శారీరక మార్పులు, హర్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గుల వల్ల ఆ ప్రభావం శరీర బరువుపై పడుతుంది. ఇది అన్ని రకాల అనారోగ్య సమస్యలకు హేతువుగా మారుతోంది. స్త్రీలలో రక్తహీనత చాలా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. పోషకాహార లోపం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు.

శరీరానికి అందాల్సిన సూక్ష్మపోషకాలైన విటమిన్లు, జింక్‌, ఐరన్‌ లోపం వల్ల రక్తహీనతకు గురవుతున్నారు. గర్భిణుల్లో ఇది మరింత ప్రమాదకరంగా మారుతోందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, నెలలు నిండక ముందే ప్రసవం, అధిక రక్తస్రావం వంటి సమస్యలకు దారి తీస్తుంది. మరోవైపు ఎక్కువ శాతం మంది పురుషులు అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నట్లు సర్వే తేల్చింది. జీవనశైలి సమస్యలు వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. ఫలితంగా కొవిడ్‌ లాంటి వ్యాధులు వీరిపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వ్యాయామం తప్పనిసరి

సమతుల ఆహారానికి దూరం కావడం.. శారీరక వ్యాయామం లేకపోవడం.. ఆందోళన.. ఒత్తిడి తదితర కారణాలు జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకే చోట గంటల తరబడి కూర్చొని పని చేయడం.. వేళాపాళా లేని భోజన సమయాలు.. ఎక్కువగా బయట ఆహారం తీసుకోవడం తదితర కారణాలు అధిక బరువు, ఊబకాయానికి దారి తీస్తున్నాయి.

12 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ భోజనంలో 400 గ్రాములు ఆకుకూరలు, కూరగాయలు, 250 గ్రాముల సీజనల్‌ పండ్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతోపాటు ప్రొటీన్‌ కోసం మాంసం, చేపలు, గుడ్డు లాంటివి తీసుకోవాలి. జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండటంతోపాటు రోజూ 30-45 నిమిషాలపాటు చెమట పట్టేలా శారీక వ్యాయామం తప్పనిసరి. కరోనా మహమ్మారి నేపథ్యంలో బరువు తగ్గడంతోపాటు మధుమేహం, అధిక రక్తపోటు నియంత్రణలో పెట్టుకోవడం చాలా అవసరమని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:

మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆస్పత్రి వ్యవహారంపై హైకోర్టులో వ్యాజ్యం..

ABOUT THE AUTHOR

...view details