'అక్టోబరు 10నుంచి 16 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు' - CPM
దేశంలో ఆర్థిక మాంద్యంపై కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంరోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వామపక్ష పార్టీలు నిర్ణయించినట్లు సీపీఎం పోలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు తెలిపారు.
దేశంలో ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న సమస్యలపై ఐదు వామపక్ష పార్టీలు దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశమయ్యాయి. అక్టోబర్ 10 నుంచి 16 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సీపీఎం పోలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు తెలిపారు. భాజపా పాలనలో అన్నిరంగాలు చిన్నాభిన్నమైయ్యాయని రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి విదేశీ పర్యటనలపై ఉన్న మోజు దేశ సమస్యలపై లేదని మండిపడ్డారు. ఆర్థిక మాంద్యంతో పరిస్థితి దిగజారుతుంటే.. ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీరిగ్గా చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.