PRC ISSUE :ఉపాధ్యాయులపై దుష్ప్రచారం చేస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామరాజు అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్న ఆయన.. కరోనా వేళ ప్రజలను ప్రభుత్వం ఆదుకుందన్న మాట అబద్దమని స్పష్టం చేశారు. కరోనా సాయం పేరుతో దోచుకున్నారని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలను చూస్తేంటే జాలేస్తుందన్న ఎంపీ.. వైకాపా కోసమే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ విధులను కూడా గొప్పగా చెప్పుకుంటున్నారన్న రఘురామ.. ప్రభుత్వ పథకాలపై సీఎం బొమ్మ తీసేయాలని తెలిపారు. పత్రాలపై సీఎం బొమ్మ విషయంలో కోర్టు వెళ్తా అని అయన స్పష్టం చేశారు.
హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులా?: అచ్చెన్నాయుడు
హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులా అని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. తెదేపా 43శాతం పీఆర్సీ ఇస్తే తప్పుబట్టిన జగన్ రెడ్డి ఈరోజు అసలు వేతనాలకు ఎసరు పెట్టారని మండిపడ్డారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పి కాగ్ నివేదికలు చెబుతున్నా ఆదాయం లేదంటూ ఉద్యోగుల పొట్ట కొట్టటం దుర్మార్గమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఉద్యోగులకు ఇచ్చిన హమీల్లో రెండున్నరేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఉద్యోగులకు మొండిచేయి చూపారని ఆరోపించారు.