రాష్ట్రంలో గోకులం, మినీ గోకులం పథకాల కింద పశువుల సంరక్షణకు షెడ్లు నిర్మించాలని 2018లో ప్రభుత్వం నిర్ణయించింది. రెండు పశువులకు రూ.లక్ష, నాలుగు పశువులకు రూ.1.50 లక్షలు, ఆరు పశువులకు రూ.1.80 లక్షల అంచనాతో ప్రతిపాదనలను రూపొందించారు. రైతు వాటాగా 10% చెల్లిస్తే.. మిగిలిన 90% ఉపాధి హామీ నిధులు, పశు సంవర్థకశాఖ చెల్లిస్తాయి. ిల్లాకు వెయ్యి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 13వేల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించారు. 72,745 మంది రైతులు దరఖాస్తు చేశారు. దీంతో ప్రభుత్వం వాటి సంఖ్య పెంచింది. 55వేల మందికి అనుమతులు రాగా తమ వాటాగా 10% మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించారు.
ప్రభుత్వం మారడంతో ఆశలు తలకిందులు
పశు సంవర్థకశాఖ అధికారుల సూచనతో... ఒక్కో జిల్లాకు 3వేల నుంచి 5వేల మంది రైతులు నిర్మాణాలను ప్రారంభించారు. షెడ్డుతోపాటు కింద కాంక్రీట్ పనులను పూర్తి చేశారు. గాలికి పంకాలనూ అమర్చారు. మొత్తంగా ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేశారు. అంతలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో.. మినీ గోకులం పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పూర్తయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. అనుమతిచ్చినా నిర్మాణాలను ప్రారంభించని వాటిని, 25% లోపు పూర్తయిన వాటిని రద్దు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ సంగతి తెలియక కొందరు.. అప్పటికే చేపట్టిన పనులను పూర్తి చేశారు. 13 జిల్లాల్లో 40వేల వరకు షెడ్లు వివిధ దశల్లో (25% పైగా పనులతో) ఉన్నట్లు అంచనా. ఇందులో 30వేలకు పైగా షెడ్ల నిర్మాణం పూర్తయి ఉంటుందని చెబుతున్నారు.
అసలు.. ఆపై వడ్డీలు.. తడిసి మోపెడు
చిన్న, సన్నకారు రైతులు సొంతంగా రూ.లక్షలు ఖర్చు చేసే పరిస్థితి లేకనే.. ప్రభుత్వం రాయితీ ఇస్తుందని ముందుకొచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కరికి సగటున రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు అప్పులు మిగిలాయి. లక్షన్నరకు ఏడాదికి.. 100కు రూ.2 వడ్డీపై లెక్కేస్తే రూ.36వేలు అవుతాయి. రెండున్నరేళ్లకు అసలు, వడ్డీ కలిపితే.. రూ.2.40 లక్షలు అవుతున్నాయి. వీటిని భరించలేక ఎక్కువ మంది రైతులు గేదెలను తెగనమ్మి అప్పులు తీరుస్తున్నారు. తామిప్పుడు కూలి పనికి పోతున్నట్లు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లోని పలువురు రైతులు వాపోయారు.