ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Khammam student లక్షలు వదిలి లక్ష్యం కోసం కదిలిన ఖమ్మం కుర్రాడు - Andhra pradesh news

Akhil Kongara invents Zink Air Vehicle Battery చమురు ధరలు చుక్కలంటుతున్నాయి. పైగా కాలుష్యం. అందుకే అంతా బ్యాటరీ మంత్రం జపిస్తున్నారు. ఈ వాహనాల్లో వాడే లిథియం-అయాన్‌ టెక్నాలజీ మనది కాదు. ముడిసరుకూ ఇక్కడ దొరకదు. ఖరీదూ ఎక్కువ. దీనికి ప్రత్యామ్నాయంగా జింక్‌ ఎయిర్‌ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేశాడు తెలంగాణలోని ఖమ్మం కుర్రాడు అఖిల్‌ కొంగర. ఈ ఆవిష్కరణను విస్తృతం చేయడానికి రూ.12 లక్షల జీతమిచ్చే కొలువునూ వదులుకున్నాడు. అతడి పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం, ఐఐటీ మద్రాసు నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నాయి.

Khammam student
లక్షలు వదిలి లక్ష్యం కోసం కదిలిన ఖమ్మం కుర్రాడు

By

Published : Aug 27, 2022, 10:02 PM IST

Akhil Kongara invents Zink Air Vehicle Battery : అఖిల్‌ది వ్యవసాయం కుటుంబం. వరంగల్‌ ఎన్‌ఐటీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. మంచి జీతమే అయినా దేశానికేమీ చేయలేకపోతున్నాననే అసంతృప్తి వెంటాడేది. దాంతో 2017లో ‘గేట్‌’ రాసి ఐఐటీ-మద్రాసులో సీటు సంపాదించాడు. కోర్సు పూర్తవుతుండగానే టాటాస్టీల్‌లో రూ.12లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. వేరొకరైతే ఎగిరి గంతేసేవారే. కానీ ఉద్యోగం వదులుకొని పీహెచ్‌డీలో భాగంగా విద్యుత్తు వాహనాలకు ప్రత్యామ్నాయ బ్యాటరీ రూపకల్పనపై పరిశోధన చేయాలనుకున్నాడు అఖిల్‌.

Zink Air Vehicle Battery:దాదాపు మూడేళ్లు కష్టపడి ‘జింక్‌-ఎయిర్‌’ బ్యాటరీ అభివృద్ధి చేశాడు. ఇందులో జింక్‌ ఆనోడ్‌లాగా పనిచేస్తుంది. అది గాల్లోని ఆక్సిజన్‌ తీసుకుని విద్యుత్తును సృష్టిస్తుంది. ఈ ప్రక్రియలో విద్యుత్తుతో పాటు జింక్‌ ఆక్సైడ్‌ అనే పదార్థం బ్యాటరీలో ఉండిపోతుంది. దీన్ని పడేయకుండా జింక్‌గా మార్చి తిరిగి వాడేలా రీసైకిల్‌ చేసే సాంకేతికత ఆవిష్కరించాడు. వీటిని వాహనాల్లో వాడితే ఖర్చు భారీగా తగ్గుతుంది.

ఈ ప్రక్రియ స్థానిక పెట్రోలు బంకుల్లోనే జరిగేలా సౌర విద్యుత్తు యూనిట్లను డిజైన్‌ చేశాడు. ప్రస్తుతం లిథియం-అయాన్‌ బ్యాటరీలు వాడుతున్న వాహనదారులు వాహనంలో రెండు బ్యాటరీలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి అయిపోగానే మరొకటి మార్చాలి. అఖిల్‌ అభివృద్ధి చేసిన ‘జింక్‌-ఎయిర్‌’ బ్యాటరీలకు ఆ అవసరం లేదు. ఛార్జింగ్‌ తక్కువగా ఉండగానే రీఛార్జి స్టేషన్‌కు తీసుకొచ్చి జింక్‌ ప్లేట్లను (క్యాసెట్‌) మార్చుకుంటే సరిపోతుంది. ‘మనం పెట్రోలు అయిపోతున్నప్పుడు ఎలా ట్యాంకు నింపుతామో.. ఇదీ అంతే’ అంటాడు అఖిల్‌. పైగా లిథియం-అయాన్‌తో పోలిస్తే వీటి ఖర్చు తక్కువ. కాకపోతే దీని పికప్‌ మిగతావాటిలా ఉండదు. గంటకు అరవై కిలోమీటర్లకు మించి వాహనాలు వేగంగా పరుగెత్తవు. టెక్నాలజీని మరింత అభివృద్ధి పరిచి.. మేటి వేగం ఉండేలా తీర్చిదిద్దుతానంటున్నాడు అఖిల్‌.

మూడేళ్ల శ్రమ..:ముడిచమురు ధరలు రోజురోజుకీ పెరగడం, కాలుష్యం అధికమవడంతో ప్రపంచ దేశాలన్నీ విద్యుత్తు వాహనాల వాడకంపైనే దృష్టి పెడుతున్నాయి. వీటిలో వాడే లిథియం-అయాన్‌ బ్యాటరీ సాంకేతికత కోసం మనం చైనా, ఆస్ట్రేలియా, దక్షిణామెరికా లాంటి దేశాలపై ఆధారపడుతున్నాం. పైగా వాటి తయారీ ఖర్చు ఎక్కువ. అందుకే 2019లోనే దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాటరీ తయారు చేయాలనుకున్నాడు అఖిల్‌.

మొదటి రెండేళ్లు ఎలాంటి టెక్నాలజీ దేశానికి అవసరం అనే దానిమీదే కష్టపడ్డాడు. ఖర్చు, తయారీ భారం తగ్గించేవి.. విద్యుత్తు సామర్థ్యం, వేగం, విద్యుత్తు నిల్వ పెంచేవి తదితర అంశాల్ని బేరీజు వేసుకుని చాలా రకాల బ్యాటరీ సాంకేతికతలపై లెక్కలు కట్టాడు. చివరికి స్వదేశీ పరిజ్ఞానంగా జింక్‌ఎయిర్‌ ఉత్తమమనే నిర్ణయానికొచ్చాడు. ఇందుకోసం ఐఐటీ మద్రాసులోని ప్రొఫెసర్‌ అరవింద్‌ కుమార్‌ చంద్రన్‌ సలహాలు తీసుకున్నాడు. తర్వాత మరో పరిశోధకుడు గుంజన్‌ కపాడియా అఖిల్‌కి జత కలిశాడు. వీళ్ల పరిశోధనలపై నమ్మకం కుదరడంతో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ రూ.1.5 కోట్లు, ఐఐటీ మద్రాసు రూ.4 కోట్ల నిధులు కేటాయించాయి. మరో ఆటోమొబైల్‌ సంస్థ సైతం ఆర్థిక సాయం చేసింది.

'ప్రస్తుతం నమూనా బ్యాటరీ సిద్ధమైంది. ఈ ఏడాది చివరికి ద్విచక్ర వాహనం తయారీ పూర్తవుతుంది. దాన్ని పరీక్షించి చూస్తాం. అవసరమైతే మార్పులు, చేర్పులు చేస్తాం. ఈ సాంకేతికతపై పేటెంట్‌కి దరఖాస్తు చేశాం. జింక్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ చేసి గృహావసరాలకు వినియోగించుకునేలా ‘లాంగ్‌ డ్యురేషన్‌ ఎనర్జీ స్టోరేజీ’ కోసం పరిశోధనలు చేస్తున్నాం. ఇది సత్పలితాలనిస్తే.. విద్యుత్తు రంగంలో సరికొత్త విప్లవం సాధ్యమవుతుంది.' -హిదాయతుల్లాహ్‌.బి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details