KCR National Party updates: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి ముహూర్తం కుదిరింది. దసరా రోజున మధ్యాహ్నం 1:19 గంటలకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. విజయదశమి రోజున తెరాస కార్యవర్గ భేటీలో జాతీయ పార్టీకి ఆమోదం తెలపనున్నారు. హైదరాబాద్‌లో ఇవాళ మంత్రులు, తెరాస జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో సమావేశమైన గులాబీ దళపతి.. జాతీయ పార్టీపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దసరా రోజున మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేయబోతున్నారని.. సమావేశంలో పాల్గొన్న తెరాస నేతలు తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నేతలు అన్నారు. దేశవ్యాప్తంగా పలు పార్టీలు.. కేసీఆర్ జాతీయ పార్టీలో విలీనమయ్యేందుకు సిద్ధమయ్యాయని.. ఈ నెల 5న కొందరు నేతలు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 9న దిల్లీలో బహిరంగ సభ నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
దసరారోజు జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసేందుకు గులాబీ దళపతి సిద్ధమవుతున్నారు. అదేరోజు తెరాస ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు, రాష్ట్రకార్యవర్గ సమావేశం జరగనుంది. జాతీయపార్టీ ఏర్పాటు చేయాలని తెరాస విస్తృతస్థాయి సమావేశం తీర్మానం చేయనుంది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే 33 జిల్లాల అధ్యక్షులు ముక్తకంఠంతో కోరారు.