ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఏ మాత్రం బాధ్యత లేదని అర్థం అవుతోందని.. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకీ కొవిడ్ కేసులు పెరుగుతూ ఉంటే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయమని విద్యావేత్తలు, ఉపాధ్యాయ వర్గాలు, విద్యార్థుల తల్లితండ్రులు కోరుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉపాధ్యాయులను కొవిడ్ కేంద్రాల్లో విధులకు పంపించడం.. ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్టగా దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలోనే ఉపాధ్యాయులకు కొవిడ్ కేంద్రాల విధులు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. విద్యార్థుల యోగక్షేమాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఉపాధ్యాయులను కొవిడ్ కేంద్రాలకు పంపించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విద్యార్థుల తల్లితండ్రులు భయంతో ఉన్న తరుణంలో ఉపాధ్యాయులను కొవిడ్ కేంద్రాల్లో డ్యూటీకి పంపించడమేంటని నిలదీశారు. ప్రభుత్వం పంతాలు పట్టింపులకు పోకుండా పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని.. సి.బి.ఎస్.ఈ., తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. ఉపాధ్యాయులను కొవిడ్ కేంద్రాల దగ్గర విధులను నుంచి ఉపసంహరించుకోవాలన్నారు.