రైతులపై వైకాపా ప్రభుత్వం కనికరం లేకుండా దాడి చేయించిందంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పార్టీ నేతలతో అమరావతిలో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధాని ఎక్కడికీ పోదని.. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ అమరావతికే వస్తుందని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు వైకాపా అభ్యర్థుల్లో ఏ ఒక్కరినీ గెలిపించవద్దని ప్రజలను కోరారు. తన నుంచి రోజూ అద్భుతాలు ఆశించవద్దని.. ఫలితాన్ని మాత్రం తాను తప్పక చూపిస్తానని స్పష్టం చేశారు. వైకాపా నేతల పదజాలం.. వారి పార్టీ వైఖరిని తెలియజేస్తోందని అన్నారు. రైతుల బాధ వింటుంటే ఆవేదన కలుగుతోందని చెప్పారు. పాశవికంగా రైతులపై దాడులు చేశారని ఆవేదన చెందానన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదని స్పష్టం చేశారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని ఆకాంక్షించారు.
''ఇంతమంది రైతులతో కన్నీళ్లు పెట్టించారు. వైకాపా నేతలు ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నారు. రాజధాని ఇక్కడే ఉండాలని సమష్టి నిర్ణయం జరిగింది. దివ్యాంగులను సైతం పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఒకే సామాజిక వర్గం, ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. వైకాపా వినాశనం మొదలైంది.. భవిష్యత్తులో వైకాపా మనుగడ ఉండదు. చరిత్రలో ఎప్పుడూ ఇంతమంది ఆడపడుచులను హింసించింది లేదు. ఇంత పెద్దఎత్తున భూములు ఇవ్వడం జరగలేదు. ఇక్కడి నుంచి రాజధాని కదలదు. ధర్మంపై నిలబడితే అదే మనల్ని నిలబెడుతుంది. అమరావతి శాశ్వత రాజధాని ఇక్కడే ఉంటుంది. అమరావతి పరిరక్షణ సమితితో కలిసి పనిచేస్తాం. రైతులకు మాటిస్తున్నా.. ఎన్ని రాజధానులు మార్చినా శాశ్వత రాజధాని ఇక్కడే ఉంటుంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేస్తే కేసులు పెట్టండి. వైకాపా వాళ్లకు అమరావతిలో భూములు ఉంటే రాజధాని మార్చరు. విశాఖలో భూములు కొని రాజధాని అక్కడికి మారుస్తున్నారు. రైతులను పరామర్శించేందుకు కూడా అనుమతించలేదు. పోలీస్ శాఖను ప్రభుత్వం వ్యక్తిగతంగా వాడుకుంటోంది. రాజధాని ఇక్కడే ఉంటుందని భాజపా కూడా చెప్పింది'' అని పవన్ వ్యాఖ్యానించారు.