పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టిన వనజీవి రామయ్య తనకు ఆదర్శప్రాయుడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కోటికి పైగా మొక్కలు నాటిన భూమిపుత్రుడు దరిపెల్లి రామయ్య అని అభివర్ణించారు. మాటలతో కాకుండా చేతలతోనే కీర్తి ప్రతిష్టలు వస్తాయనేందుకు నిలువెత్తు నిదర్శనం రామయ్య అన్నారు.
నిస్వార్థంతో మొక్కలను పెంచటం ద్వారా వనజీవి రామయ్యగా.. ఆయన విశ్వ విఖ్యాతమయ్యారని వ్యాఖ్యానించారు. పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారం ఆయన్ను వెతుక్కుంటూ వచ్చిందని గుర్తు చేశారు. అలాంటి స్ఫూర్తి ప్రదాత.. తనను ఉద్దేశించి వీడియో విడుదల చేయటం...తన బాధ్యతను మరింతంగా పెంచిందన్నారు. వనజీవి రామయ్య ఆశయాలను జనసేన తరఫున ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు.