ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 3, 2020, 10:39 PM IST

ETV Bharat / city

జాతీయ ఉత్తమ పోలీస్​స్టేషన్​గా జమ్మికుంట ఠాణా

తెలంగాణలోని కరీంనగర్​ జిల్లా జమ్మికుంట పోలీస్​స్టేషన్​.. జాతీయ ఉత్తమ ఠాణాగా ఎంపికైంది. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 16,671 ఠాణాల్లో... జమ్మికుంట పీఎస్ 10వ స్థానాన్ని సాధించింది. ఈ మేరకు కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి... ఠాణాను సందర్శించి సిబ్బందిని అభినందించారు.

best police station
సిబ్బందికి మిఠాయిలు తినిపిస్తున్న ఉన్నతాధికారులు

జాతీయ స్థాయిలో ఉత్తమా ఠాణాగా జమ్మికుంట పోలీస్ స్టేషన్

జాతీయ ఉత్తమ పోలీస్​స్టేషన్‌గా తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట ఠాణా ఎంపికైంది. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న 16,671 పోలీస్​ స్టేషన్లలో 10 ఉత్తమ పోలీస్​స్టేషన్లను ఎంపిక చేశారు. అందులో రాష్ట్రం నుంచి జమ్మికుంట పీఎస్‌ 10వ స్థానాన్ని దక్కించుకుంది. 2017 ఆగస్ట్​ నెలలో మోడల్‌ ఠాణాగా ఎంపిక చేశారు. స్టేషన్‌కు అన్ని మౌలిక వసతులు కల్పించారు.

100 శాతం సీసీ కెమెరాలు...

కరీంనగర్​తో పాటు స్టేషన్‌ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో 100 శాతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా పోలీసులు గ్రామస్థులను ప్రోత్సహించారు. పట్టణంలోకి ప్రవేశం నుంచి పట్టణం దాటే వరకు కూడా సీసీ కెమెరాలను నిక్షిప్తం చేశారు. ప్రతిక్షణం ఏ వాడలో ఏం జరుగుతుంతో సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. స్టేషన్‌ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రజల చేత భేష్‌ అనిపించుకుంటున్నారు.

మర్యాదగా స్వీకరణ...

ప్రజలతో మర్యాదగా మాట్లాడుతూ వారి నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. చట్ట పరిధిలో వాటిని పరిశీలిస్తున్నారు. ఫిర్యాదుదారులకు తగు న్యాయం చేస్తున్నారు. దొంగతనాలు, మహిళలపై అఘాయిత్యాల వంటి వాటిపై ఉక్కుపాదం మోపుతున్నారు. దొంగతనాల కేసులను విచారించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. సీసీ కెమెరాల సహాయంతో దొంగలను చాకచక్యంగా పట్టుకుంటున్నారు. వారి నుంచి చోరీ సొత్తును రికవరీ చేస్తున్నారు.

ఉత్తమ ఠాణాగా ఉత్తర్వులు...

పోలీస్​ స్టేషన్​​లో ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. చక్కగా మొక్కలను పెంచుతున్నారు. చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులను సమకూర్చారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించిన జమ్మికుంట పోలీస్​స్టేషన్‌ను.. జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్​ స్టేషన్‌గా ఎంపిక చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

సందర్శించిన సీపీ...

ఈ సందర్భంగా కరీంనగర్‌ పోలీస్​ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి, అదనపు సీపీ చంద్రమోహన్‌లు జమ్మికుంట పోలీస్​ స్టేషన్‌ను సందర్శించారు. ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ సృజన్‌రెడ్డి, పోలీస్​ సిబ్బందిని అభినందించి.. మిఠాయిలు తినిపించారు. జమ్మికుంట మున్సిపల్‌ ఛైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, తహసీల్దార్‌ నారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ రశీద్‌తో పాటు పలువురు నాయకులు సీఐని సన్మానించారు. శాలువాలతో సత్కరించారు.

కమిషనరేట్​ పరిధిలో రెండు...

గతంలో ఇక్కడి పోలీస్​ స్టేషన్‌ పనితీరు అంతంతమాత్రంగా ఉండేదని.. ఇప్పుడు ఉత్తమ సేవలను అందిస్తోందని సీపీ కమలాసన్ రెడ్డి అన్నారు. కరీంనగర్‌ పోలీస్​ కమిషనరేట్‌ పరిధిలో వరసగా రెండుసార్లు రెండు పీఎస్​లు జాతీయస్థాయిలో గుర్తింపును సాధించాయన్నారు.

అభినందనలు...

గతేడాది చొప్పదండి పోలీస్​స్టేషన్‌ జాతీయస్థాయిలో 8వ స్థానం దక్కించుకుందన్నారు. ఈసారి జమ్మికుంట పోలీస్​స్టేషన్‌ పదో స్థానాన్ని సాధించిందని సీపీ అన్నారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందంటూ.. స్టేషన్‌కు రూ.7,500ల రివార్డును ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఉత్తమ పోలీస్​స్టేషన్‌గా ఎంపిక కావటంపై డీజీపీ మహేందర్‌రెడ్డి, మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌తో పాటు పలువురు అభినందించారన్నారు.

ఇదీ చూడండి:

ఈఎస్​ఐ మందుల కొనుగోలు కేసు.. కోర్టులో లొంగిపోయిన నిందితుడు

ABOUT THE AUTHOR

...view details