ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కళాశాలలు ప్రత్యేక ఫీజులు వసూలు చేయకుండా చూడండి: సీఎం జగన్

జగనన్న విద్యాదీవెన మొదటి విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ప్రారంభించారు. జగనన్న విద్యా దీవెన గొప్ప కార్యక్రమమని సీఎం జగన్​ అన్నారు. చదువుతోనే జీవితాల రూపు రేఖలు మారతాయన్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.671 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు.

jagananna vidhya deevena program first phase money released
jagananna vidhya deevena program first phase money released

By

Published : Apr 19, 2021, 11:53 AM IST

Updated : Apr 20, 2021, 6:54 AM IST

కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ప్రత్యేక ఫీజులు, ఇతర పేర్లతో అదనపు రుసుములు వసూలు చేయకుండా అధికారులు పర్యవేక్షించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వం పూర్తి బోధనా రుసుములను చెల్లిస్తుందని స్పష్టంచేశారు. కళాశాలల్లో లోపాలున్నా, వసతులు సక్రమంగా లేకపోయినా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా 1902 నంబరుకు ఫోన్‌ చేయాలని, ప్రభుత్వం స్పందించి పరిస్థితి మారేలా చూస్తుందన్నారు. తాడేపల్లిలో సోమవారం ‘జగనన్న విద్యాదీవెన’ ద్వారా ప్రస్తుత విద్యాసంవత్సరం తొలి త్రైమాసికం బోధనా రుసుములు రూ.671.45 కోట్లను ఆన్‌లైన్‌లో సీఎం విడుదల చేశారు.

జగనన్న విద్యా దీవెన ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం జగన్​

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘9,79,445 లక్షల మంది తల్లులు, దాదాపు 10.88 లక్షల విద్యార్థులకు మేలు చేకూర్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ ఏడాది తొలి త్రైమాసికం బోధనా రుసుముల్ని ఇప్పుడు ఇస్తున్నాం. గతేడాది 10.11 లక్షల మంది విద్యార్థులకు మేలు చేస్తే.. ఈసారి ఆ సంఖ్య 10.88 లక్షలకు చేరింది. అదనంగా 77 వేల మందికి ప్రయోజనం చేకూరింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బోధనా రుసుములు జమచేస్తే.. వారంలో ఆ మొత్తాలను కళాశాలలకు చెల్లిస్తారు. ఇలా గతంలో ఎవరూ చేయలేదు. త్రైమాసికం ముగిసేలోగా ఫీజులు విడుదల చేయడం గొప్ప విషయం’ అని వివరించారు.

తల్లిదండ్రులకు ప్రశ్నించే అవకాశం

‘ప్రతి త్రైమాసికంలోనూ బోధనా రుసుముల్ని విడుదల చేస్తే.. విద్యార్థి తల్లి లేదా తండ్రి కళాశాలకు వెళ్లి ఫీజులు చెల్లిస్తారు కనుక అక్కడేమైనా లోపాలుంటే నిలదీసే అవకాశముంటుంది. ఈ విధానంతో కళాశాలల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కావొద్దన్న ఉద్దేశంతోనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుచేస్తున్నాం. విద్యార్థుల వసతి, ఆహార ఖర్చులకు ‘జగనన్న వసతిదీవెన’ ద్వారా ఆర్థికసాయం అందిస్తున్నాం. గత ప్రభుత్వం 2014-2019 వరకూ రూ.1,880 కోట్లు బకాయిలు పెట్టింది. బోధనారుసుములనూ అరకొరగానే ఇచ్చేది. గతేడాది రూ.4,208 కోట్లను చెల్లించి బకాయిల్లేకుండా చేశాం. 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కష్టాలు, బాధల్ని స్వయంగా చూశా. అందుకే పూర్తి బోధనా రుసుముల్ని చెల్లిస్తున్నాం’ అని జగన్‌ పేర్కొన్నారు.

ప్రతి అడుగులోనూ అండ

‘ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించడం.. మూడేళ్లలోపు చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్చడం... ఇలా ప్రతి అడుగులోనూ అండగా నిలుస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖల్ని మార్చి వాటిని పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాం. విద్యార్థులకు పౌష్టికాహారం సరఫరా చేస్తున్నాం. రోజుకో మెనూతో గోరుముద్ద పథకాన్ని అమలుచేస్తున్నాం. నాడు-నేడు ద్వారా స్కూళ్లలో సమూలమార్పులు చేస్తున్నాం. విద్యార్థులకు పుస్తకాలు, బూట్లు, ఏకరూప దుస్తులతో పాటు స్కూల్‌ బ్యాగులు, ఆంగ్ల నిఘంటువులు ఇస్తున్నాం. ఉన్నత విద్య ఇప్పుడు కనీస అవసరంగా మారింది. పేదరికం నుంచి బయటపడేందుకు, మంచి ఉపాధికి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, సమాజంలో గౌరవం పొందడానికి, భవిష్యత్తు తరాలకు మెరుగైన బాటలు వేసేందుకు పెద్ద చదువులు అవసరం. పేద కుటుంబంలో పుట్టిన అంబేడ్కర్‌ అన్నింటికీ ఎదురీది ఉన్నతస్థాయి చదువులు చదివారు. చివరకు రాజ్యాంగం రాశారు’ అని వివరించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బోధనా రుసుముల్ని అరకొరగా చెల్లించిందని.. ప్రస్తుత ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లిస్తూ విద్యార్థులకు అండగా నిలుస్తోందన్నారు.

ఇదీ చదవండి:

కరోనా ఉద్ధృతి: రోగులు నేలపై.. ప్రాణాలు గాల్లో..

Last Updated : Apr 20, 2021, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details