ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల నిర్మించుకోవడం తప్ప వేరే మార్గం లేదని, అందుకు అవసరమైన పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విన్నవించింది. దిల్లీలో బుధవారం పర్యావరణ మదింపు కమిటీ (ఈఏసీ) ఛైర్మన్ గోపకుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించింది. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి వై.పి.సింగ్ హాజరయ్యారు. వివిధ రంగాల నిపుణులు 15మంది వరకు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున కర్నూలు జలవనరులశాఖ చీఫ్ ఇంజినీరు మురళీనాథ్‌రెడ్డి హాజరయ్యారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇంతకుముందు లేవనెత్తిన అభ్యంతరాలు, అనుమానాలను నివృత్తి చేస్తూ ఇప్పటికే కమిటీకి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక నేపథ్యంలో కమిటీ ఛైర్మన్, సభ్యులు అడిగిన అనేక ప్రశ్నలకు మురళీనాథ్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారు. తొలుత సీఈ పవర్ పాయింటు ప్రజంటేషన్‌లో అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. తర్వాత సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇంతకుముందు సమావేశం అనంతరం లేవనెత్తిన ఆరు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు న్యాయస్థానం ప్రస్తావించిన నాలుగు అంశాలకు సమాధానం ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో లేవనెత్తిన అభ్యంతరాలు, సమాధానాలు ఇలా ఉన్నాయి.
- ఏ క్లాజు పరిధిలో ఈ ప్రాజెక్టుకు తాము పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని కొందరు సందేహాలు లేవనెత్తారు. అసలు రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు అవసరం లేదనేది తమ భావన అని, కానీ హరిత ట్రైబ్యునల్ అనుమతులు తీసుకోవాలని చెప్పడంతో తాము కమిటీ ముందుకు వచ్చినట్లు సీఈ వివరించారు.
- ఇంతకుముందు శ్రీశైలంలో +854 అడుగుల నీటిమట్టం అని తరచు వినిపించేదని, ఇప్పుడు ఆ మాట ఎందుకు వినిపించడం లేదని ఒక నిపుణుడు ప్రశ్నించినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో 854 అడుగుల నీటిమట్టం చేరేవరకూ ఎటూ నీళ్లు వినియోగించకూడదనే ఒప్పందం ఉండేదని.. ప్రస్తుతం చాలా ఏళ్లుగా 800 అడుగుల దిగువ నుంచి కూడా నీళ్లు తీసుకుంటున్నారని.. ఏపీ కేవలం 841 అడుగుల నుంచే నీటిని మళ్లించగలదని, ఎవరు దిగువ నుంచి నీళ్లు తీసుకుంటున్నారో అర్థమవుతుందంటూ.. అందుకే రాయలసీమ ఎత్తిపోతల అవసరం అవుతోందని వివరించారు.
- ఈ ఎత్తిపోతల ఎలాంటి వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలోకీ రాదని, అటవీ ప్రాంతానికి దూరంగా ఉందని, జీవావరణ సున్నిత ప్రాంతానికి దూరంగా ఉందని పత్రాలతో సహా నివేదించిన విషయాన్ని సీఈ వివరించారు.