CJI JUSTICE NV RAMANA : హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని ఈనెల 18న ప్రారంభించనున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వెల్లడించారు. హెచ్ఐసీసీలో జరిగిన ఐఏఎంసీ సన్నాహక సమావేశంలో సీజేఐ జస్టిస్ రమణ కీలకోపన్యాసం చేశారు. పాండవులు, కౌరవుల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు శ్రీకృష్ణుడు ప్రయత్నించాడని... మధ్యవర్తిత్వం విఫలమైతే విపత్తులకు దారి తీస్తుందనేందుకు మహాభారతమే ఉదాహరణ అని సీజేఐ పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితంలో వివాదం తలెత్తితే నచ్చని వారికి దూరంగా ఉండటమో.. అవసరమైతే కొంత డబ్బు, ఆస్తిని వదులుకుంటారన్నారు. కానీ వ్యాపారంలో డబ్బు, ప్రతిష్టగా పణంగా పెట్టలేరని.. అందుకే త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటారని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ పేర్కొన్నారు. అయితే ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాల తర్వాతే.. చివరి ప్రయత్నంగా కోర్టులను ఆశ్రయించాలని... తన 40 ఏళ్ల అనుభవంతో సూచిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కోర్టులకెక్కితే వివిధ ప్రక్రియలతో మరింత నష్టపోతారని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్బిట్రేషన్, మీడియేషన్ వంటి విధానాలతో వివాదాలు పరిష్కరించుకోవడానికి మొగ్గు చూపుతున్నారన్నారు.
మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు
‘కోర్టులకు వచ్చే ముందు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉంది. కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలి. సంప్రదింపుల ద్వారా సమస్యలు కొలిక్కి తేవచ్చు. ఆస్తుల పంపకాలను కుటుంబసభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతోంది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ సరైన వేదిక. సాధ్యమైనంత వరకు మహిళలు మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలి. విస్తృత సంప్రదింపులతో ఇరు పక్షాలకు ఆమోదయోగ్య పరిష్కారం సాధ్యం. -జస్టిస్ ఎన్.వి.రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఐఏఎంసీ ట్రెండ్ మార్చబోతోంది..
CJI JUSTICE NV RAMANA : హైదరాబాద్లోని ఐఏఎంసీ ట్రెండ్ మార్చబోతున్నదని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ నిపుణులు కేంద్రంలో పాలుపంచుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. ప్రస్తుతం పారిస్, సింగపూర్, హాంకాంగ్, న్యూయార్క్ వంటి వాణిజ్య హబ్లలోనే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో అనేక పరిశ్రమలు.. సదుపాయాలు ఉన్నాయని.. వాటికి తోడు ఇక్కడి ప్రజలు సాదరంగా స్వాగతిస్తారని... అందుకే ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సీజేఐ తెలిపారు. జూన్లో ప్రతిపాదన తెలపగానే సీఎం అంగీకరించడంతో తన స్వప్నం సాకారమవుతోందన్నారు. తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తే... చట్టాల్లో మార్పుల్లో భాగంగా తెలుగు బిడ్డ పీసీ రావు ఆర్బిట్రేషన్ చట్టాన్ని రూపకల్పన చేశారన్నారు. న్యాయం, తీర్పులు చెప్పడానికి కోర్టులే.. న్యాయ పట్టాలు అవసరం లేదని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ప్రభుత్వాలు, అధికారులతో పాటు సమాజంలో గుర్తింపు, విశ్వసనీయత ఉన్న వ్యక్తులు కూడా సమస్యను అర్థం చేసుకొని తీర్పు చెప్పవచ్చనన్నారు. గరికపాటి, నాగఫణి శర్మ వంటి వారు కూడా ఆర్బిట్రేషన్ కేంద్రంలో భాగస్వాములు కావాలని సీజేఐ సూచించారు. పారిశ్రామిక వివాదాలే కాకుండా కుటుంబ సమస్యలు, సామాన్యుల వివాదాలను కూడా సరళమైన పద్ధతుల్లో పరిష్కరించవచ్చునన్నారు.
శాశ్వత భవనం పుప్పాలగూడలో..
ఐఏఎంసీ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక కేంద్రంగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలకు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో రచ్చబండ వంటి పద్ధతుల్లో ఎప్పటి నుంచో ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార విధానం అందుబాటులో ఉందన్నారు. కొంత ఆలస్యంగానైనా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రంలో హైదరాబాద్‌లో ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదుగుతోందన్నారు.. ఇక్కడ అనేక ఫార్చూన్ 500 సంస్థలు ఉన్నాయన్నారు. ఐఏఎంసీ కోసం వెంటనే 25వేల చదరపు అడుగుల కేంద్రాన్ని తాత్కాలికంగా సమకూర్చామని... శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో త్వరలో భూమిని కేటాయించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.