కృష్ణాడెల్టా రైతులకు ఖరీఫ్ సీజన్లో వరే సిరి. దురదృష్టవశాత్తూ కొన్నేళ్లుగా వరిలో దిగుబడులు తగ్గుతున్నాయి. పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. యువత పట్టణాలకు వలస వెళ్తుండడంతో వ్యవసాయం చేసేవాళ్లూ తక్కువయ్యారు. ఈ సమస్యలనే సవాల్‌గా స్వీకరించింది ప్రాణధార ట్రస్ట్. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా సమస్యకు.. పరిష్కారాలు వెతుకుతోంది. మినీ ట్రాక్టర్లను పొలంలోకి దించి, వాటికి అనుసంధానంగా విభిన్న పనిముట్లు తయారు చేసింది. వాటితో గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువుజమ్ములపాలెంలో ప్రయోగాత్మకంగా 12 వందల ఎకరాలు సాగు చేస్తున్నారు.
నాట్లు వేయడం మొదలు కలుపు నివారణ, రసాయనాల పిచికారీ, ఎరువుల వాడకం ఇలా అన్నింటికీ యంత్రాలనే వినియోగిస్తోంది ప్రాణధార ట్రస్ట్. ఖర్చంతా భరిస్తూ.. గ్రామంలోనే వ్యవసాయ యంత్ర పరికరాల తయారీ యూనిట్ పెట్టి.. రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఆచార్య NG రంగా వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ మెళకువలు వరిసాగులో ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని రైతులు అంటున్నారు.