అనంతపురం ఆస్పత్రి ఘటన దిగ్భ్రాంతికరమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కరోనా రోగులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులపై ఒక్కసారైనా సమీక్ష చేశారా..? అని ప్రశ్నించారు. సీఎం నిర్లక్ష్యం వల్లే అమాయక ప్రజలు బలవుతున్నారన్న చంద్రబాబు... మంత్రులు, ఎంపీలు పొరుగు రాష్ట్రాల్లో వైద్యం తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను మాత్రం గాలికి వదిలేశారని ఆక్షేపించారు.
అసలు పాలన అనేది ఉందా..?
ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాల లేవనే అనుమతిలేని ఆసుపత్రులకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. 104 పని చేయదు... అంబులెన్సులు రావని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిర్ధరణ పరీక్షలు చేయరని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు పాలన అనేది ఉందా..? అని పవన్ ప్రశ్నించారు.