ప్రపంచం అంతా ఈరోజు మహిళా దినోత్సవాన్ని ఘనంగా చేస్తుంది. కానీ మనదేశం ఆది నుంచీ స్త్రీ మూర్తికి ప్రణమిల్లుతోంది. మూల్లోకాలనూ తన ఆజ్ఞతో నడిపించే పరమశివుడు, విష్ణుమూర్తులే స్త్రీ శక్తిని పూజించారు. అర్థనారీశ్వరా అంటే శివుడు పొంగిపోడా.. సతీమణి అలిగితే శ్రీవారు కాల్లుపట్టడా..! ''యత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమంతే దేవత'' (ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు తిరుగుతారు) అని మన పూర్వికులు ఎప్పుడో నినదించారు.
'ఆమె' త్యాగాలు అనిర్వచనీయం... సమయస్ఫూర్తి ఎందరికో స్ఫూర్తి - Indians Respect women
పుట్టుకతో మొదలై... ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లై... కలసి పెరిగే చెల్లై... అక్క రూపానికి నెలవై.. మదిలో మధురిమల ప్రేమసాగరానికి అలై... కష్టసుఖాల కడలిలో నిత్యం నిలిచే ఇల్లాలై... ఇంట్లో కూతురిలా చిరునవ్వుల వెలుగై... వేసే ప్రతి అడుగులో జీవితానికి వెలుగునిస్తున్న మహిళా రూపాన్ని... మన దేశంలో ఎప్పటినుంచో కొలుస్తున్నాం. మన పురాణాల్లో పూజించాం. ఆరాధించాం. ఇప్పటికీ గౌరవిస్తున్నాం.
''భరత మాత''గా గౌరవిస్తున్నాం..
భారతదేశాన్ని మనం ఇప్పటికీ 'భరత మాత'గా పిలుస్తాం.. గౌరవిస్తాం. ఈ భూమిపైన ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎందరో వీరనారీమణుల వీరోచితంగా పోరాడిన చరిత్ర మరవలేనిది. వారంతా కేవలం మహిళా లోకానికే కాదూ.. మొత్తం సమాజానికే ఆదర్శం. ఏ దేశ చరిత్ర చూసినా... వాటి అభివృద్ధి వెనక స్త్రీ శక్తి, మహిళా కష్టం ఉంటుంది. ఆమె త్యాగాలు అనిర్వచనీయం. స్త్రీ సమయస్ఫూర్తి ఎందరికో స్ఫూర్తి. ఆమె సహనం, ఓర్పు, నేర్పు.. ఈ సమాజానికి ఓ కూర్పు. ఆమె జ్ఞానం అజ్ఞానపు చీట్లను తొలగించే విజ్ఞానపు హరివిల్లు. ఆమె ఆక్రోశం అగ్నిపర్వతమై రగిలే లావ. అందుకే 'ఆమె'కు సలాం చేద్దాం.