లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత రాష్ట్రంలో కరోనా మరింత ఉద్ధృతంగా విస్తరిస్తోంది. కొత్తగా 465 మందికి వైరస్ సోకినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల కిందట బయట ప్రాంతాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో అతన్ని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. రామానాయక్ తండ గ్రామపంచాయతీ కేంద్రంలోని వ్యక్తి కరోనా బారిన పడ్డట్లు అధికారులు వెల్లడించారు.
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలో 2479 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 72 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో కర్నూలు జిల్లాలోని 31 మంది... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 38 మందికి వ్యాధి సోకినట్లు అధికారులు వెల్లడించారు. తాజా కేసుల్లో కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 14 మందికి, ఆదోని మున్సిపాలిటీ పరిధిలో 7, కర్నూలు రూరల్ ప్రాంతంలో 2, దేవనకొండ, కౌతాళం, ఎమ్మిగనూరులో ఒక్కొ కేసు చొప్పున పాజిటివ్ వచ్చింది. కర్నూలులోని రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రి నుంచి తొమ్మిది మంది కరోనా నుంచి పూర్తిగా కొలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
గుంటూరు జిల్లాలో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలో కేసుల సంఖ్య 788కు చేరింది. కొత్త కేసుల్లో గుంటూరు నగరంలోనే 15 నమోదయ్యాయి. నర్సరావుపేట5, తెనాలి4, మంగళగిరి 1, ఉండవల్లి 1 చొప్పున నమోదైనట్లు అధికారులు తెలిపారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ క్యాంపులో పనిచేస్తున్న నలుగురికి కరోనా సోకింది. విధుల నిర్వహణ కోసం వెళ్లినపుడు వీరు వైరస్ భారిన పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దీంతో క్యాంపులోని అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గుంటూరు నగరంలో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నగరంలోని ఏటీ అగ్రహారం, శ్యామలనగర్, పాతగుంటూరు, సంగడిగుంట, అంకిరెడ్డి పాలెం, అనంతవరం, భారత్ పేట, కొరిటపాడు, క్రిష్ణ నగర్, ఎస్వీన్ కాలనీ, నల్లచెరువు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా గతంలో కేసులు వచ్చిన ప్రాంతాలే కావటంతో పాజిటివ్ రోగుల నుంచి వైరస్ వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు.