తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ యథావిధిగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 17తో దేశవ్యాప్త లాక్‌డౌన్ ముగుస్తున్నందున కేంద్ర ప్రభుత్వమిచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని తెలిపారు. ఈ వైరస్ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు కాబట్టి అందుకనుగుణంగా వ్యూహం అనుసరించక తప్పదని చెప్పారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ఎక్కడా కరోనా చికిత్స పొందుతున్న వారి (యాక్టివ్) కేసులు లేవని కేసీఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు కొనసాగిస్తూనే, వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం సీఎం కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
‘తెలంగాణలో హైదరాబాద్ పరిధిలోని ఎల్.బి.నగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ జోన్లలో 1,442 కుటుంబాల్లోనే వైరస్ ఉంది. యాదాద్రిభువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన కొందరు వలస కూలీలకు వైరస్ సోకినట్లు తేలింది తప్ప, ఆ జిల్లా వాసులెవరికీ పాజిటివ్ లేదు. వారు కూడా హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసులున్న నాలుగు కంటెయిన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి. నెలకు ఐదుసార్లు సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయాలి. మే నెల చివరి నాటికి రెండు సార్లు, జూన్‌లో ఐదుసార్లు పిచికారీ చేయాలి. పట్టణాల్లో మేయర్లు, చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచి, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ చైర్‌పర్సన్లు క్రియాశీలకంగా వ్యవహరించాలి. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు వారికి తగిన సూచనలివ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 20 నుంచి తెలంగాణకు హరితహారం నిర్వహించాలి.‘