financial year returns: ఏపని చేద్దామన్నా... ఆర్థిక సమస్యలు అడ్డుతగులుతున్నాయని, ఆశించిన స్థాయిలో వ్యవస్థల ఆదాయం పెరగడంలేదని ఆందోళన వ్యక్తంచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబడులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి నవంబరు నెలాఖరుకున్న పరిస్థితులపై కాగ్ లెక్కలు విడుదల చేసింది. మొత్తంగా రూ.88,618.58 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈ గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంపై ఆందోళన నెలకొంది.
గత అయిదేళ్లలో ఇదే అధికం
ఒకవైపు ఇటీవల అనేక సందర్భాల్లో వివిధ వర్గాల డిమాండ్లను నెరవేర్చాల్సిన క్రమంలో రాబడుల విషయమై ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచాన్ని 2020 తర్వాత కరోనా అతలాకుతలం చేసింది. అంతకుముందు సాధారణ పరిస్థితులున్న 2019 నవంబరు ఆదాయం కన్నా కూడా ప్రసుత రెవెన్యూ అధికంగానే ఉంది. 2017 నవంబరు నుంచి పోల్చినా ఈ ఆదాయమే ఎక్కువ కావడం గమనార్హం.
సాధారణం కన్నా అధికం
సాధారణంగా రాబడులు ప్రతి ఏటా 15% మేర మెరుగుపడుతుంటాయని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఈ లెక్కన చూసినా కరోనా ముందున్న సాధారణ పరిస్థితుల్లో వచ్చిన ఆదాయం కన్నా కూడా ఇప్పుడు అధికంగా రాబడులు వచ్చాయి. 2019 నవంబరు నాటికి ఎలాంటి కరోనా పరిస్థితులు లేవు. సాధారణ రెవెన్యూ రాబడులు సాధించే పరిస్థితులు ఉన్నాయి. ఆ ఏడాది నవంబరు నెలాఖరు నాటికి కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్ర రాబడి రూ.63,750.41 కోట్లు. ఆ తర్వాత 2020 మార్చి నుంచి కరోనా ప్రబలడంతో లాక్‌డౌన్ పెట్టారు. తిరిగి అదే ఏడాది నవంబరు నాటికి తొలి వేవ్ పరిస్థితులు క్రమంగా తగ్గాయి. ఆ సమయంలో వచ్చిన ఆదాయం రూ.66,708.47 కోట్లు. అంతకుముందు ఏడాది కన్నా కొద్దిమేర మాత్రమే పెరిగింది. ఇక 2021లో రెండో వేవ్ కుదిపేసినా... ఆదాయంపై ఎక్కువ ప్రభావం కనిపించలేదని కాగ్ లెక్కలను చూస్తే అవగతమవుతోంది. 2021 నవంబరు నెలాఖరుకు రూ.88,618.58 కోట్లు రాష్ట్రానికి రెవెన్యూ రాబడులు వచ్చాయి. సాధారణ పరిస్థితిలో ప్రతి ఏటా 15% చొప్పున రెండేళ్లకు 30% పెరగాల్సి ఉండగా అది 39 శాతంగా నమోదైంది. దీన్ని సానుకూల పరిణామంగానే విశ్లేషించవచ్చు.