తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,95,232 కేసులు నమోదవగా.. అందులో 2.7శాతం (10,671) పదేళ్ల లోపు పిల్లలే కావడం గమనార్హం. ఇందులో 1.4శాతం (5,533) బాలురు, 1.3శాతం (5,138) బాలికలు ఉన్నారు. దాదాపు నెలన్నర (45 రోజుల) వ్యవధిలోనే అయిదు వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మొదటి దశలో పదేళ్లలోపు పిల్లల్లో అతి తక్కువగా 0.1 శాతం మందికి కరోనా సోకింది. రెండో దశ మొదలైన తర్వాత పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ సోకిన పిల్లల చికిత్స కోసం ఆసుపత్రుల్లోనూ ప్రత్యేకంగా వార్డులు ప్రారంభమయ్యాయి. పిల్లల ఆసుపత్రుల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత వారిని మెరుగైన చికిత్స కోసం పెద్దాసుపత్రులకు పంపిస్తున్నారు. పిల్లలు ఆసుపత్రుల్లో చేరినప్పటికీ మరణాలు పెద్దగా నమోదవకపోవడం కొంత మేరకు ఊరట కలిగించే అంశమనే చెప్పాలి.
అజాగ్రత్త వల్లే..
ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే రెండో దశలో పిల్లలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. మొదటి దశలో తల్లిదండ్రులతోపాటు ఇతరులు పిల్లలకు వ్యాధి సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. లాక్‌డౌన్, కంటెయిన్‌మెంట్ల వంటి చర్యలూ వ్యాధి నివారణకు తోడ్పడ్డాయి. రెండో దశలో ఈ పరిస్థితులు కనిపించడం లేదు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడం, ఇతరులతో వారు సంచరించడం, కొన్నాళ్లపాటు పాఠశాలలు తెరవడం, మాస్క్‌లు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం, శానిటైజ్ చేయకపోవడం తదితర కారణాలతో పిల్లలకు వ్యాధి వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఇప్పటివరకు పెద్దలకు సంబంధించిన కొవిడ్ నివారణ చికిత్స విధానాలే అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు సంబంధించి ప్రత్యేక ప్రొటోకాల్ రూపొందించలేదు. దీంతో ఎక్కువ వయసు కల వారికి ఇచ్చే మందులనే పిల్లల్లో వ్యాధి నివారణకు ఉపయోగిస్తున్నారు. కేంద్రం పిల్లల్లో వ్యాధి నివారణకు ప్రత్యేక ప్రొటోకాల్‌ను రూపొందించి ప్రచారం కల్పిస్తే వారిని కొవిడ్ నుంచి విముక్తి చేయవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి