ప్రసవ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు వైకల్యంతో జన్మించడంతో... తల్లిదండ్రులకు రూ.60 లక్షల పరిహారం, రూ.20 వేలు ఖర్చులు చెల్లించాలని ఆసుపత్రిని ఆదేశిస్తూ తెలంగాణలోని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పు వెలువరించింది. నాగర్‌కర్నూల్ సమీపంలోని గ్రామానికి చెందిన పెద్దగళ్ల శిరీష గర్భధారణ అనంతరం 6వ నెల నుంచి హైదరాబాద్‌లోని ఫెర్నాండజ్ ఆసుపత్రికి వెళ్లారు. మొదటిసారి తనకు సిజేరియన్ జరిగినట్లు వారికి నివేదించారు. తాము సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తామని... అవసరమైన పరీక్షల తర్వాత నిర్ణయం తీసుకుంటామని వైద్యులు ఆమెకు తెలిపారు.
ప్రసవం కోసం శిరీష 2019 ఫిబ్రవరి 14న ఉదయం ఆసుపత్రిలో రూ.50 వేలు అడ్వాన్స్‌గా చెల్లించి చేరారు. ప్రసవం సమయంలో ఉంటానని చెప్పిన వైద్యురాలు ఆ సమయంలో రాలేదు. ఇతర వైద్యుల పర్యవేక్షణలో సాధారణ ప్రసవం కోసం ఇంజక్షన్ల సాయంతో ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో 2019 ఫిబ్రవరి 15 తెల్లవారుజామున 3గంటలకు శిరీషకు అత్యవసరంగా సిజేరియన్ చేశారు.