ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీపీఎఫ్ మాయ.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏదయా?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేసిన రూ.వందల కోట్లు మాయమైన విషయం ఇంకా రగులుతూనే ఉంది. దీన్ని సాంకేతిక తప్పిదంగా రాష్ట్ర ప్రభుత్వం చూపే ప్రయత్నం చేసినా.. ఇందులో అనేక సందేహాలకు సమాధానం  లభించడం లేదు. ఆర్థిక మాయకు ‘సాంకేతిక తప్పిదం’ అనే ముసుగు వేసి ప్రస్తుతానికి "మమ" అనిపించే ప్రయత్నాలు సాగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

GPF accounts
GPF accounts

By

Published : Jul 1, 2022, 7:05 AM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేసిన రూ.వందల కోట్లు మాయమైన విషయం ఇంకా రగులుతూనే ఉంది. దీన్ని సాంకేతిక తప్పిదంగా రాష్ట్ర ప్రభుత్వం చూపే ప్రయత్నం చేసినా.. ఇందులో అనేక సందేహాలకు సమాధానం లభించడం లేదు. ఆర్థిక మాయకు ‘సాంకేతిక తప్పిదం’ అనే ముసుగు వేసి ప్రస్తుతానికి మమ అనిపించే ప్రయత్నాలు సాగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కిందటి ఏడాది నవంబరులో కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ఈ అంశంపై దృష్టి సారించారని, దీనిపై రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులకు, ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయానికి మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాలు సాగుతున్నాయని తెలిసింది. ఇది సాంకేతిక తప్పిదమే అయితే ఇంత సుదీర్ఘంగా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాల్సినంత అవసరం ఏముంటుందనేది చర్చనీయాంశమవుతోంది.

ఈ ప్రశ్నలకు బదులేదీ?

* వేలమంది రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలకు జమ చేసిన జీపీఎఫ్‌ సొమ్ములు మాయమయ్యాయి. అసలు ఎంత మొత్తం? ఎందరి ఖాతాలకు ఇలా జరిగిందనే ప్రశ్నకు అధికారులు నోరు మెదపడం లేదు. ఇంకా పరిశీలిస్తున్నామనే ఖజానా, ఆర్థిక శాఖల అధికారులు చెబుతున్నారు.

* ఇది జరిగింది ఎప్పుడో మార్చి నెలలో... వెలుగులోకి వచ్చింది రెండ్రోజుల కిందట. ఇన్నాళ్లూ పరిశీలించలేదని చెప్పడంలో అంతరార్థం ఏమిటన్న ప్రశ్నకూ సమాధానం లేదు.

ఈ వివరణ సందేహాల మయం...

‘ఉద్యోగుల డీఏ బకాయిల బిల్లులు జీపీఎఫ్‌కు జమచేసేవి, నగదు రూపంలో చెల్లించేవి పేమెంట్‌ అప్లికేషన్‌కు పంపించాం. ఖజానా శాఖ డైరెక్టర్‌ మార్గదర్శకాల ప్రకారం ఆమోదించిన తర్వాతే పేమెంట్‌ అప్లికేషన్‌కు పంపాము. అందులో మేము చెల్లింపులు చేయకపోయినా పొరపాటున ఆ మొత్తాలు జీపీఎఫ్‌ ఖాతాలకు జమయ్యాయి. ఇది సాంకేతిక తప్పిదమే. ట్రెజరీ నిబంధనల ప్రకారం మార్చి 31 నాటికి జమకాని ఏ బిల్లు పెండింగులో ఉన్నా అది రద్దయిపోతుంది. అందుకే పొరపాటున జీపీఎఫ్‌ ఖాతాలకు జమ అయిన మొత్తాలు మళ్లీ డెబిట్‌ అయ్యాయి’ అని ఆర్థికశాఖ అధికారులు వివరణ ఇచ్చారు.

* ఉద్యోగుల్లో సీపీఎస్‌ ఉద్యోగులు, పాత పెన్షన్‌ విధానం ఉద్యోగులు ఉన్నారు. కరవు భత్యం బకాయిలు పాత పెన్షన్‌ విధానం ఉద్యోగులకు వారి ఖాతాలకు జమచేసి పదవీవిరమణ తర్వాత చెల్లిస్తారు. సీపీఎస్‌ ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లిస్తారు. సాంకేతిక తప్పిదం అయితే సీపీఎస్‌ ఉద్యోగులకు నగదు ఎందుకు జమ కాలేదు? పుస్తకాల్లో సర్దుబాటు చేసే చోట మాత్రమే సాంకేతిక తప్పిదం ఎలా జరిగిందన్న ప్రశ్నకు సమాధానం లేదు.

ఇది పూర్తిగా ఒక ఆర్థిక మాయ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చాలా రోజులుగా ఖాతాలకు జమ చేసినట్లు చూపించిన మొత్తాలకు.. అసలు తాము ఆ బిల్లులు పాస్‌ చేయలేదని చెప్పడం విశేషం. అనేక రోజుల పాటు సాగిన వ్యవహారాన్ని ఎలా సాంకేతిక తప్పిదంగా పేర్కొంటారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు మళ్లీ ఎప్పుడు ఉద్యోగుల ఖాతాలకు జమ చేస్తారని ప్రశ్నిస్తే ఉద్యోగులంతా మళ్లీ డీఏ ఎరియర్స్‌ బిల్లులు పెట్టుకుని పంపిస్తే వాటిని ఆమోదించాక వారి ఖాతాలకు జమ చేస్తామని చెబుతున్నారు. ప్రజాపద్దు (పబ్లిక్‌ అకౌంట్‌)లో ఎక్కువ మొత్తాలు ఉంటే దాన్ని ప్రభుత్వ రుణంగా చూపించాల్సి వస్తుందన్న కారణంతోనే తరచూ ఈ వ్యవహారాలు సాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మొత్తం మీద ప్రభుత్వ రుణమూ, ఖర్చు కూడా తగ్గించి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఒక ఆర్థిక మాయకు సాంకేతిక తప్పిదం అనే ముసుగు తగిలిస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details