గుంటూరు జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 32 శాతం అధికంగా కురవటంతో... ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలు నీటమునిగాయి. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో... పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరికొద్ది రోజుల్లో చేతికొస్తుందనుకున్న పంట కళ్లముందే వర్షార్పణం అయిపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పొలాల్లో కుళ్లిపోతున్న పంటను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఇంకా నీటిలోనే...
అధిక పెట్టుబడులతో ముడిపడిన పత్తి, పొగాకు, తమలపాకు, పసుపు వంటి వాణిజ్య పంటలతోపాటు... ఆహార పంటలు వేసిన రైతులందరూ భారీ వర్షాలకు పూర్తిగా నష్టపోయారు. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు, దుగ్గిరాల మండలాల్లో పొలాలు ఇంకా నీటిలోనే ఉండటంతో... తమ పెట్టుబడి డబ్బులూ రావని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి మండలం గుండిమెడ, చిర్రావూరు, కుంచనపల్లిలో కాయగూరలు, ఆకుకూరల పంటలు నీట మునిగాయి. వీటిని పరిశీలించిన వ్యవసాయ అధికారులు... జిల్లాలో 8 వేల 800 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేశారు. నీటమునిగిన ప్రతి సెంటుకూ పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరదనీరు పూర్తిగా తొలగిన తరువాత పంట నష్టం వివరాలను పూర్తిగా లెక్తిస్తామన్నారు.