ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వం, జస్టిస్‌ ఈశ్వరయ్యపై ప్రస్తావనల్ని ఉపసంహరించుకుంటున్నాం: హైకోర్టు ఆర్​జీ - హైకోర్టు వార్తలు

ప్రభుత్వం, జస్టిస్‌ ఈశ్వరయ్యపై ప్రస్తావనల్ని ఉపసంహరించుకుంటున్నట్లు... హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీ) భానుమతి ధర్మాసనానికి తెలిపారు. వీటితో పాటు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య గురించి ప్రస్తావించిన అంశాల్నీ ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

highcourt withdraws remarks on government and Justice Eshwaraya
'ప్రభుత్వం, జస్టిస్‌ ఈశ్వరయ్యపై ప్రస్తావనల్ని ఉపసంహరించుకుంటున్నాం'

By

Published : Aug 6, 2020, 7:52 AM IST

హైకోర్టు వ్యతిరేక తీర్పులను ప్రభుత్వం ఆనందంగా ఆమోదించలేక పోతోందంటూ తాను కౌంటర్‌లో పేర్కొన్న విషయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీ) భానుమతి ధర్మాసనానికి తెలిపారు. వీటితో పాటు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య గురించి ప్రస్తావించిన అంశాల్నీ ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. ఆర్‌జీ తరఫున న్యాయవాది అశ్విన్‌కుమార్‌.. ఈ వ్యహారానికి సంబంధించి కౌంటర్లోని 13వ పేరాను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు వెల్లడించారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. హైకోర్టును కరోనా రెడ్‌ జోన్‌గా ప్రకటించాలని, హైకోర్టు ఇంఛార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ మృతిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్ ఫెడరేషన్‌ సభ్యుడు లక్ష్మీనర్సయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ వ్యాజ్యానికి విచారణార్హత లేదని పేర్కొంటూ ఆర్‌జీ హైకోర్టులో కౌంటర్‌ వేశారు. హైకోర్టు వెల్లడించిన వ్యతిరేక తీర్పులను ప్రభుత్వం ఆనందంగా ఆమోదించలేక పోతోందని పేర్కొన్నారు. జస్టిస్‌ ఈశ్వరయ్య ప్రస్తావన తెస్తూ ఆరోపణలు చేశారు.

బుధవారం జరిగిన విచారణలో అడ్వొకేట్ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఆర్‌జీ వేసిన కౌంటర్లోని కొన్ని అంశాలపై అభ్యంతరం తెలిపారు. హైకోర్టు తీర్పులపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. న్యాయవ్యవస్థపై శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనుచిత వ్యాఖ్యలపై కోర్టుధిక్కార ప్రొసీడింగ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయని ఆర్‌జీ కౌంటర్లో పేర్కొన్నారని, తనకు తెలిసినంత వరకు పెండింగ్‌లో లేవని ఏజీ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details