చంద్రబాబు భద్రతపై కోర్టుకు కూడా ప్రభుత్వం అవాస్తవాలు చెప్పి దొరికిపోయిందని తెలుగుదేశం నేతలు విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా భద్రత తగ్గించి... ఇప్పుడు పునరుద్ధరించే పరిస్థితి తెచ్చుకున్నారన్నారు. సర్కారు పేర్కొన్న అంకెలకు... వాస్తవ లెక్కలకు పొంతన లేదన్నారు. చంద్రబాబుకు 58మంది బదులు 74మందితో భద్రత కల్పిస్తున్నామని సర్కారు న్యాయస్థానానికి నివేదించింది. 2014కు ముందు చంద్రబాబుకు ఒక ఏఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు ముఖ్య భద్రతాధికారులు(సీఎస్వోలు)గా ఉండేవారు. ముగ్గురు ఇన్స్పెక్టర్లతో 3బృందాలు ఉండేవి.
సబ్ ఇన్స్పెక్టర్లు ముగ్గురు, 9మంది కానిస్టేబుళ్లు ఉండేవారు. దీనికి అదనంగా ఇంటి భద్రతలో భాగంగా ఇద్దరు ఎస్సైలు, 8మంది పీసీలు ఉండేవారు. జిల్లా ఎస్కార్ట్‌లో భాగంగా ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు, కాన్వాయ్‌లో 8వాహనాలుండేవి. ఒక పైలెట్ వాహనంతో పాటు 2బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఒక జామర్ వాహనం, ఎన్ఎస్జీ వాహనాలు రెండు ఉండేవి. మొత్తం 17మంది కాన్వాయ్ ప్రయాణంలో ఉండేవారు. ఇంటి భద్రత బృందాలు రెండు షిఫ్టుల్లోను... ప్రయాణ భద్రత దళాలు 3షిఫ్టుల్లోను కలిపి ఒక కంపెనీగా మొత్తం 66 మంది గార్డులు ఉండేవారు.