పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో సీనియర్ ఆసిస్టెంట్‌గా పనిచేస్తున్న లక్ష్మి నరసింహమూర్తి జీతం విషయంలో కోత వద్దని హైకోర్టు స్పష్టం చేసింది. జీతం కోత విషయంలో ప్రభుత్వం జారీచేసిన జీవో 26 అమలును పిటిషనర్ విషయంలో నిలుపుదల చేసింది. మరోవైపు న్యాయాధికారుల జీతాల్లోను కోత విధింపుపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కరోనా నేపథ్యంలో ఉద్యోగుల పూర్తి జీతం చెల్లించకుండా సగం చెల్లింపులను వాయిదా వేసేందుకు వీలు కల్పిస్తూ మార్చి 31 న ప్రభుత్వం జారీచేసిన జీవో 26ని సస్పెండ్ చేయాలని, మార్చి నుంచి తన మొత్తం జీతం చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ కొవ్వూరులోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సీనియర్ అసిస్టెంట్ వై.లక్ష్మీనరసింహమూర్తి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. జ్యుడీషియల్ ఉద్యోగులు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదన్నారు. వారి జీతాల్లో కోత విధించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. జ్యుడీషియల్ ఉద్యోగుల జీతాల్లోనే కాకుండా న్యాయాధికారుల జీతాల్లోను ప్రభుత్వం కోత విధించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. హైకోర్టు మాన్యువల్ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదించారు. ప్రాథమికంగా చూస్తే జ్యుడీషియల్ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు పునరుద్ఘాటించింది. జీవో 26 అమలును నిలుపదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. పిటిషనర్‌కు చెందిన జీతం విషయంలో అధికారుల జోక్యాన్ని నిలువరించింది.