విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గౌరవించాల్సిన అవసరం ప్రభుత్వం, డిస్కంలపై ఉందని పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి .. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏ, విద్యుత్ యూనిట్ టారిఫ్ నిబంధనలను మార్చాలని కోరడం సరికాదని అన్నారు. పీపీఏల పట్ల నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. టారిప్ ధరలను తగ్గించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు, ఏపీ విద్యుత్ నియంత్రణ మండలిని కోరడానికి వీల్లేదని కోర్టుకు వివరించారు. టారిఫ్ ధరలను సమీక్షించే అధికార పరిధి ఏపీ ఈఆర్‌సీకి లేదని చెప్పారు. విద్యుత్ యూనిట్ ధరలను తగ్గిస్తే పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థల హక్కులకు భంగం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
యూనిట్ ధరలను సమీక్షించే పరిధి ఈఆర్‌సీకి ఉందని హైకోర్టు సింగిల్ జడ్జి పొరపాటు పడ్డారన్నారని.. నిన్న జరిగిన విచారణలో విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరఫు సీనియర్ న్యాయవాది బసవప్రభుపాటిల్, తదితరులు వాదనలు వినిపించారు. వారి వాదనలు ముగియడంతో ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనల కోసం విచారణ సోమవారానికి వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏ యూనిట్ టారిఫ్ ధరలను ఏపీ ఈఆర్‌సి సమీక్షించేందుకు వీలు కల్పిస్తూ 2019 లో సింగిల్ జడ్డి ఇచ్చిన తీర్పుపై సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి.