పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నప్పుడు వాయిదా వేయమని పదేపదే అడగటం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు వెళ్లొచ్చని తెలిపింది. హైకోర్టులో దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారించిన హైకోర్టు ఈ వ్యాఖ్యాలు చేసింది. పోలీసులు అక్రమంగా నిర్బంధించారని హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతోంది.
ఈ సమయంలో పోలీసుల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. విచారణను పదే పదే వాయిదా వేయమనటం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మళ్లీ వాయిదా అడిగితే అంగీకరించలేమని.. అటువంటి పరిస్థితి వస్తే పోలీసు అధికారులు.. వాదనలు వినిపించేందుకు ముందుకు రావటంలేదని భావించాల్సి వస్తుందని కోర్టు తెలిపింది.