ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని ఏర్పాటు గురించి ఏపీ విభజన చట్టంలో స్పష్టంగా ఉందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిదీష్ గుప్తా పేర్కొన్నారు. బహుళ రాజధానుల ప్రస్తావన ఆ చట్టంలో లేదని, శాసనకర్తల ఉద్దేశం ఒక రాజధానేనని స్పష్టం చేశారు. రాజధాని వ్యాజ్యాలపై రైతుల తరఫున మంగళవారం హైకోర్టులో ఆయన వాదనలను వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం కొత్తగా ఏర్పడనున్న ఏపీలో రాజ్‌భవన్, హైకోర్టులను ఒక్కొక్కటిగానే పేర్కొన్నారని తెలిపారు. పూర్తి స్థాయి వాదనలను వినిపించేందుకు సమయం లేకపోవటంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై రోజువారీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ రైతులు ఇడుపులపాటి రాంబాబు, ఎన్.రామకృష్ణ మరో ఇద్దరు దాఖలు చేసిన వ్యాజ్యంలో సీనియర్ న్యాయవాది నిదీష్ గుప్తా వాదనలను వినిపించారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసే అధికారం అధికరణ 3 ప్రకారం పార్లమెంటుకు ఉందని, ఈ నేపథ్యంలోనే ఏపీ విభజన చట్టం తీసుకొచ్చారని తెలిపారు. ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు కోసం ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో శివరామకృష్ణన్ కమిటీ ఏర్పడిందని దీనికి చట్టబద్ధత ఉంటుందని గుర్తు చేశారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, మంత్రులతో ఏర్పడ్డ కమిటీలకు విలువ ఉండదని స్పష్టం చేశారు. ఈ కమిటీల నివేదికల ఆధారంగా పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను చేసే అధికారం రాష్ట్రానికి లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు తెచ్చిందని వాదించారు.
రైతుల హక్కులకు భంగం కలిగే రీతిలో వ్యవహరించడం తగదు