Heli Taxi At Medaram: తెలంగాణలోని మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలీరైడ్ ఏర్పాటు చేస్తోంది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ.. ఈ సర్వీసులను ఈనెల 13 నుంచి అందుబాటులోకి తీసుకొస్తుంది. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి మేడారం వరకు రానుపోనూ ఒక్కొక్కరికి రూ.19,999గా నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది. మేడారం జాతరలో ఏరియల్ వ్యూ రైడ్ కోసం ఒక్కొక్కరికి రూ.3,700 వసూలు చేయనున్నట్లు తెలిపింది. హెలికాప్టర్ రైడ్ బుకింగ్ కోసం 9400399999, 9880505905, info@helitaxii.com ద్వారా సంప్రదించాలని కోరింది. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ములుగు కలెక్టర్ సూచించారు.
నాలుగు రోజులపాటు..
ములుగు జిల్లాలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం మహాజాతర జరగనుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ మహాజాతరకు రాష్ట్రం నలమూలల నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఫిబ్రవరి 16న కన్నెపల్లి నుంచి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను.. 17న సమ్మక్క దేవతను గద్దెలపైకి తీసుకువస్తారు. 18న అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 19న పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయడంతో మహాజాతర ముగుస్తుంది.