Rush in busstands: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పర్వదినం శోభ మొదలైంది. పల్లెల్లో ఆనందోత్సహాలతో మూడ్రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ కోసం వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా సొంతూళ్ల బాట పట్టారు. దీంతో.. హైదరాబాద్‌లోని బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లన్నీ రద్దీగా మారిపోయాయి. గడిచిన రెండ్రోజుల్లో సుమారు మూడున్నర లక్షల మంది వరకు సొంతూళ్లకు చేరుకున్నట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. పెరిగిన ప్రయాణికుల దృష్ట్యా ఈ నెల 7 నుంచి టీఎస్ఆర్టీసీ రెండు తెలుగు రాష్ట్రాలకు 4,318 బస్సులను నడుపుతోంది. వీటిలో 3వేల 318 సాధారణ బస్సులుండగా... మరో వెయ్యి ప్రత్యేక సర్వీసులున్నాయి. పండుగ కోసం నడిపే బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలనే తీసుకుంటున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
105 ప్రత్యేక రైళ్లు..
సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే సైతం 105 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మొత్తం 197 ట్రిప్పుల వరకు సర్వీసులను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో ఫ్లాట్‌ఫాంపై రద్దీని తగ్గించేందుకు ఫ్లాట్ ఫాం టికెట్ ధరలను రైల్వే శాఖ భారీగా పెంచింది. సికింద్రాబాద్ ఫ్లాట్‌ఫాం టికెట్ ధరను 10 నుంచి 50రూపాయల వరకు పెంచినట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఛార్జీలు.. ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి.