ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

OMICRON IN TELANGANA : తెలంగాణలో అన్నీ ఒమిక్రాన్‌ కేసులే.. వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్ - ఒమిక్రాన్ వ్యాప్తి

Omicron Cases in Telangana: తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. జనవరి 20వ తేదీన 91 నమూనాల్లో జన్యుక్రమ విశ్లేషణ జరపగా.. 89 నమూనాల్లో ఒమిక్రాన్​ను, 2 నమూనాల్లోనే డెల్లాను గుర్తించారు. గతనెలతో పోలీస్తే ఒమిక్రాన్ భారీగా వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధారించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తృతంగా వ్యాపిస్తున్నా.. దీనితో స్వల్ప లక్షణాలే కనిపిస్తుండడం కాస్త ఊరటనిచ్చే అంశమే.

Omicron Cases
Omicron Cases

By

Published : Jan 24, 2022, 7:32 AM IST

Omicron Cases in Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్‌ స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా గత డిసెంబరుతో పోల్చితే జనవరిలో రెట్టింపునకు మించి ఈ కేసులు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత నెల 17 నుంచి ఈ నెల 6 వరకూ మొత్తంగా 119 నమూనాల్లో జన్యుక్రమ విశ్లేషణ జరిపారు. ఇందులో 17న సేకరించిన 32 నమూనాల్లో మొత్తం అన్నీ డెల్టా వేరియంట్‌గానే నిర్ధారణ అయ్యాయి. అంటే నెల క్రితం ఒమిక్రాన్‌ వేరియంట్‌ తెలంగాణలో దాదాపుగా లేనట్లేనని తేలుతోంది. అయితే.. గత నెల 29న 27 నమూనాలను పరీక్షించగా.. ఇందులో మాత్రం 21 డెల్టా.. 6 ఒమిక్రాన్‌గా తేలాయి. ఇదే క్రమంలో జనవరి 4న 60 నమూనాలను పరీక్షించగా.. ఇందులో 25 డెల్టా.. 35 ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యాయి. అంటే ఒమిక్రాన్‌ కేసులు ఏకంగా 58 శాతానికి పెరిగాయి. తర్వాత నుంచి ఒమిక్రాన్‌ ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. తాజాగా ఈనెల 20న 91 నమూనాల్లో జన్యుక్రమ విశ్లేషణ జరపగా.. కేవలం రెండు నమూనాల్లోనే డెల్టా కనిపించింది. మిగిలిన 89 నమూనాల్లోనూ ఒమిక్రాన్‌ వేరియంటే ఉన్నట్లు ప్రయోగశాలలో నిర్ధారించారు.

  • ఒమిక్రాన్‌లోనూ ప్రధానంగా మూడు రకాల ఉప వేరియంట్లను గుర్తించారు. ఇందులో ‘బిఎ.1’ ఉప విభాగంలో 68.. ‘బిఎ.2’ ఉప విభాగంలో 236.. ‘బి.1.1.29’ ఉప విభాగంలో 5 చొప్పున ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఒమిక్రాన్‌ ఉప విభాగం ‘బిఎ.2’ ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నట్లుగా వైద్యవర్గాలు ధ్రువీకరించాయి.
  • ఈనెల 7 నుంచి 20 వరకూ సేకరించిన నమూనాలను గాంధీ ఆసుపత్రి ప్రయోగశాలలో జన్యుక్రమ విశ్లేషణ జరిపితే.. ఒమిక్రాన్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మొత్తం 273 నమూనాలను పరీక్షించగా.. ఇందులో కేవలం 14(5శాతం) నమూనాల్లో మాత్రమే డెల్టాను కనుగొన్నారు. మిగిలిన 259(95 శాతం) నమూనాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉన్నట్లు నిర్ధారించారు.
  • జిల్లాల వారీగానూ ఒమిక్రాన్‌ విశ్లేషణను జరపగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అది విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. జిల్లాల్లోనూ ఈ వేరియంట్‌ ప్రభావం గణనీయంగా ఉన్నట్లు స్పష్టమైంది.

మాస్కు, టీకాలే రక్ష

మిక్రాన్‌ వేరియంట్‌ విస్తృతంగా వ్యాపిస్తున్నా.. దీనితో స్వల్ప లక్షణాలే కనిపిస్తుండడం ఊరటనిచ్చే అంశమే. ఇప్పటి వరకూ రోజుకు 4వేలకు పైగా కేసులు నమోదవుతున్నా.. రాష్ట్రంలో 31వేల క్రియాశీల కేసులు ఉన్నా.. ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగానే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,076 మంది.. ప్రైవేటుగా 2,036 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తంగా 56,524 పడకలు అందుబాటులో ఉండగా.. 3,112(5.5 శాతం) నిండిపోయాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం లక్షణాలు స్వల్పంగా ఉన్నవారిని మాత్రం ఇంటి వద్దే చికిత్స పొందాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. మాస్కు ధరించడం ద్వారా వైరస్‌ను సమర్థంగా కట్టడి చేయొచ్చనీ, అర్హులందరూ టీకాలను పొందాలని సూచిస్తున్నారు. వచ్చే 2-3 వారాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగొచ్చని, ప్రజలంతా తప్పక కొవిడ్‌ నిబంధనలను పాటించాలని వైద్యశాఖ విజ్ఞప్తి చేసింది.

ABOUT THE AUTHOR

...view details