తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు దక్షిణ, మధ్య, తూర్పు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ... తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 16,17 తేదీలలో అధిక వర్షాలు పడే అవకాశం ఉందని.. దక్షిణ తెలంగాణ జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్ప పీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, మధ్య ట్రోపోస్పీయర్ ఎత్తు వరకు కొనసాగుతున్నదని తెలిపింది. ఈ అల్పపీడనం మరింత బలపడి సుమారు 16వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.