అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు వాన కురుస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తొలకరి జల్లులతో చెరువులు, కుంటలు నిండుతుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జలమయం
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తూలోనిగుట్ట చెరువుకు వరద పోటెత్తింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి బొమ్మసముద్రం చెరువు నిండింది. ఈ క్రమంలో తూలోనిగుట్ట చెరువులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. తూలోనిగుట్టలో పలు ఇళ్లు, పంట పొలాలు జలమయం అయ్యాయి. ఊరిలోకి నీరు చేరిందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
వరంగల్‌లో జోరు వాన
వరంగల్ నగరంలో వర్షం జోరుగా కురిసింది. హన్మకొండ, కాజీపేట, వరంగల్ నగరంలోని తదితర ప్రాంతాలలో కుండపోతగా వాన పడింది. జంట నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మురికి కాలువలు పొంగాయి. రోడ్లు, కాలనీలు నీట మునిగాయి. రోడ్ల పక్కన ఉన్న దుకాణంలోకి వరద నీరు చేరింది. వర్షం కురిసినప్పుడల్లా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
అటు వరంగల్ గ్రామీణ జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో కూడిన వాన పడుతోంది. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉదయం 7 గంటలనుంచి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. వర్ధన్నపేట బస్టాండ్‌లోకి వర్షపు నీరు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
నిండుకుండలా నల్లవాగు
ఏకధాటిగా కురుస్తున్న వానతో సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని సాగునీటి ప్రాజెక్టు నల్లవాగు నిండుకుండలా మారింది. ఆదివారం ఉదయం అలుగు పారుతోంది. 5,300 ఎకరాలకు సాగు నీరు అందించగల సామర్థ్యం ఈ చెరువుకు ఉంది. తొలకరి జల్లులకు ప్రాజెక్ట్ నిండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.