ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS RAINS: సింగరేణి ఏరియాల్లో భారీ వర్షం.. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం - సాగర్ జలాశయంలో నీటికుక్కలు సందడి..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు(TS RAINS) కురుస్తున్నాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలన్నీ జలమయమవుతున్నాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లతున్నాయి. ప్రాజెక్టులకు భారీ వరద పోటెత్తుతోంది. పలు ప్రాంతాల్లో ఇళ్లు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సింగరేణి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.

rains in telangana
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు

By

Published : Jul 22, 2021, 4:01 PM IST

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు(TS RAINS) కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీ వరద చేరుతోంది. నదుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగులు, చెరువులు ఉప్పొంగడం వల్ల పలు ప్రాంతాల్లో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడి.. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో.. జనజీవనం స్తంభించిపోయింది.

ముంచెత్తిన వాన..

భాగ్యనగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారులపైకి భారీగా వరద నీరు చేరడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.

నీట మునిగిన పంటలు..

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల(TS RAINS)తో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా గ్రామీణ నియోజకవర్గంలోని సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వాగులు పొంగుతున్నాయి. సిరికొండ మండలంలోని కప్పలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇదే మండలం రావుట్ల పరిధిలోని ఎదుల్లా చెరువు నిండి అలుగు పారుతోంది. జక్రాన్ పల్లి మండలం పేడ్ చెరువు నిండి మత్తడి పోయడం వల్ల లోతట్టు ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. హన్నాజీపేట్ చెరువు కింద వరదనీటిలో దాదాపు 50ఎకరాల పంట నీట మునిగింది. వరి నాట్లు పూర్తయిన వారంలోనే పంట నీట మునగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

నిలిచిపోయిన రాకపోకలు..

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనాపురం తీగల బంజర వద్ద పగిడిరు నిమ్మ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం- ఏనుకూరు రహదారిలో పది గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరి పొలాల్లోకి వరద చేరుతోంది. పలు మండలాల్లో రెండు రోజులుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఉప్పొంగిన వాగులు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లోని సున్నం బట్టి- బైరాగులపాడు గ్రామాల మధ్య వాగు ఉప్పొంగడంతో వరద నీరు రహదారిని ముంచెత్తింది. తాటి వారి గూడెం వద్ద చిన్న గుబ్బల మంగి వాగు పొంగి అలుగు పారింది. చాకిరేవు కుంట తదితర వాగుల్లో వరద నీరు భారీగా చేరింది. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో సీత వాగు ఉప్పొంగడం వల్ల సీతమ్మ నార చీరలు ప్రాంతాన్ని వరద నీరు కమ్మేసింది. సీత వాగులో ఉన్న సీతమ్మ విగ్రహం చుట్టూ వరద నీరు చేరింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మట్టిరోడ్లన్ని బురదమయమయ్యాయి.

గోదావరిలో పెరిగిన నీటిమట్టం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన(TS RAINS)తో.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం గోగావరి వద్ద 14.4 అడుగుల వరకు నీరు చేరగా.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరదతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు..

నిర్మల్ జిల్లా స్వర్ణ వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల జిల్లా కేంద్రంలోని సిద్దాపూర్, సోన్ మండలంలోని జాఫ్రాపూర్ గ్రామ బ్రిడ్జి నీట మునిగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని రహదారులు జలమయమయి.. వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

జలపాత సోయగాలు..

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల(TS RAINS)తో వాగులు ఉప్పొంగుతున్నాయి. బోథ్ మండలంలోని పొచ్చర్ల జలపాతం కనువిందు చేస్తోంది. ఇచ్చోడ, సిరికొండ, బజార్హత్నూర్ మండలాల్లోని గిరిజన గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. వాగులు ఉప్పొంగడం వల్ల ఈ ప్రాంతంలోని ప్రజలు బయట అడుగుపెట్టే పరిస్థితి లేదు.

రోడ్డుపైకి చేపలు..

జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల(TS RAINS)కు చెరువులు, కుంటలు నిండిపోయాయి. మెట్​పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, కథలాపూర్ మండలాల్లోని గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం యామపూర్-ఫకీర్ కొండాపూర్ మధ్య లోలెవల్ వంతెన పై నుంచి వరద నీరు భారీగా పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కథలాపూర్ మండలం సిరికొండ చెరువు నిండడంతో చెరువులో నుండి నీళ్లు, చేపలు రోడ్డుపైకి వచ్చాయి. చేపల కోసం రోడ్డుపైకి వచ్చిన జనం వాటిని పట్టుకోవడానికి ఎగబడ్డారు.

చేపల వేటకు వెళ్లొద్దు..

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గ పరిధిలో గరిడేపల్లి మండలం లింగగిరి, సర్వారం గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వేములూరి వాగు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగులో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.

గనుల్లోకి నీరు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. సత్తుపల్లి జేవీఆర్ ఉపరితల గనుల్లోకి వర్షపు నీరు(TS RAINS) చేరింది. ఉపరితల గనుల్లో 25 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ పనులకు విఘాతం కలిగింది.

మట్టి వెలికితీతకు అంతరాయం..

భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కోయగూడెం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 58 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అంతరాయం కలిగింది. 40 వేల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ పనులు నిలిచిపోగా 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది.

70వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం..

విరామం లేకుండా కురుస్తున్న వానతో పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్​లోని మూడు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి ఉపరితల గనుల్లోకి భారీగా వర్షం నీరు చేరింది. ప్రాజెక్టు క్రింద ఉన్న యంత్రాలు నీటిలో మునగకుండ అధికారులు చర్యలు చేపట్టారు. సింగరేణి డంపర్లను అధికారులు నిలిపివేశారు. రామగుండం ఓసీపీ-1,2,3 ఉపరితల గనుల్లో రోజుకు సుమారుగా 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.

కోట్ల రూపాయల నష్టం..

ఏకధాటిగా పడుతున్న వానతో.. భుపాలపల్లి సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనుల్లో వరద నీరు వచ్చి చేరింది. ఓపెన్ కాస్ట్ 2,3 గనుల్లో రోడ్లన్నీ బురదమయమై బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. 6వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు అధికారులు తెలిపారు. కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details