రాజధానికి సంబంధించిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లలో తమను కూడా పార్టీలుగా చేర్చుకోవాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన వారు పిటిషన్లు వేశారు. వాటిపై హైకోర్టు విచారణ జరిపింది. మొత్తం 229 అనుబంధ పిటిషన్లలో 200 పిటిషన్లకు పైగా మధ్యంతర ఉత్తర్వులతో రిలీఫ్ వచ్చిందని పిటిషనర్ న్యాయవాదులు, ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. మధ్యంతర ఉత్తర్వుల పరిధిలో లేని 6 అనుబంధ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిపే అవకాశముంది.
రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన రిట్ పిటిషన్లను విచారించేందుకు.. ముందు పిటిషన్లను వర్గీకరించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఈ మేరకు పిటిషన్ తరఫు న్యాయవాదులు, ఏజీ శ్రీరామ్, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ హరినాథ్ ల అభిప్రాయాన్ని ధర్మాసనం తీసుకుంది. ఏజీ, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్, పిటీషనర్ తరపు నలుగురు న్యాయవాదులు కలిసి రిట్ పిటీషన్లను అంశాల వారీగా విభజించాలని ధర్మాసనం సూచించింది. రిట్ పిటీషన్లపై సోమవారం నుంచి విచారణ జరిగే అవకాశముంది. వ్యాజ్యాలపై హైబ్రిడ్ విధానంలో విచారణ చేపట్టే అవకాశముందనే అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. అయితే పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోలేదు.