రాజధాని వ్యవహారంలో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), ఉన్నతస్థాయి కమిటీ నివేదికలను రద్దు చేయాలని రైతులు, ఇతర పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. అమరావతిని ధ్వంసం చేయాలని ముందుగా సిద్ధం చేసిన నివేదికలను జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు సమర్పించాయన్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా అవి ఉన్నాయన్నారు. ‘భూములిచ్చిన రైతుల, ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. రాజధాని మార్పునకు చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. ఆ మేరకు ఉత్తర్వులివ్వాలి’ అని కోరారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
- మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేయడంతో రాజధాని అమరావతి విషయంలో దాఖలైన వ్యాజ్యాల్లో మిగిలిన అభ్యర్థనలు ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎలాంటి ఉత్తర్వులివ్వాలనే అంశంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. వ్యాజ్యాలపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం, సీఆర్‌డీఏ, శాసనమండలి తరఫు న్యాయవాదులు గత విచారణలో వాదనలు వినిపించారు. వాటికి సమాధానంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు శుక్రవారం వాదనలు వినిపించారు.
ఓ సారి రాజధాని నిర్ణయం జరిగాక.. మార్చడానికి వీలేదు
న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, వాసిరెడ్డి ప్రభునాథ్, కేఎస్ మూర్తి, సూరనేని సాయిసంజయ్, కారుమంచి ఇంద్రనీల్‌బాబు, సూర్యప్రసాద్, జె.శేఖర్, వీవీ లక్ష్మీనారాయణ, అంబటి సుధాకరరావు, నర్రా శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాదులు ఎంఎస్ ప్రసాద్, జంధ్యాల రవిశంకర్ తదితరులు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు. ‘జీఎన్ రావు కమిటీ, బీసీజీ, ఉన్నతస్థాయి కమిటీలను రద్దు చేయాలి. రైతుల హక్కులను ఆ నివేదికలు హరిస్తున్నాయి. రాజధాని కోసం ఇప్పటివరకూ ఖర్చుచేసిన రూ.16,500 కోట్ల ప్రజాధనం గురించి కమిటీలు పట్టించుకోలేదు. అమరావతిని రాజధానిగా పేర్కొంటూ కేంద్రం నోటిఫై చేసింది. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్రాంతంలో ప్లాట్లు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలి. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను గందరగోళానికి గురిచేయాలన్న ఉద్దేశంతో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తామంటున్నారు. ఓ సారి రాజధాని నిర్ణయం జరిగాక.. మార్చడానికి వీల్లేదు. రాజధానుల విషయంలో మరింత సంప్రదింపులు అవసరం అని ప్రభుత్వం చెబుతోంది కాబట్టి.. ఇప్పటికే కమిటీలు ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం మళ్లీ పరిగణనలోకి తీసుకుంటే ఆ నివేదికలను సవాలు చేసేందుకు స్వేచ్ఛనివ్వాలి. నిధుల కొరత కారణంగా మాస్టర్‌ప్లాన్ అమలు చేయడం లేదని సీఆర్‌డీఏ చెప్పడం సరికాదు. అమరావతిలో హైకోర్టును ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు. అయినా హైకోర్టు శాశ్వత భవనాన్ని ప్రభుత్వం నిర్మించడం లేదు. న్యాయరాజధాని పేరుతో హైకోర్టును మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు. భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీలను నిర్వర్తించడంలో ప్రభుత్వం విఫలమైంది. సీఆర్‌డీఏ చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలుచేసేలా ఆదేశాలు ఇవ్వాలి. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతులకు ఇక్కడ ప్లాట్లు కేటాయించినా అభివృద్ధికి నోచుకోలేదు’ అని చెప్పారు.