తెలంగాణ సిరిసిల్లకు చెందిన బుర్ర రాజేశ్వరి పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఒకరి సాయం లేకుండా ఒక్క అడుగూ ముందుకు వేయలేని పరిస్థితి. అయినా.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఆర్ధిక ఇబ్బందులతో ఇంటర్ వరకూ చదువుకున్నారు. ఓ రోజు టీవీ కార్యక్రమంలో సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాటలతో స్పూర్తి చెందింది. తనకు లేని చేతుల గురించి ఆలోచించకుండా.. కాళ్లతోనే కవితలు రాయడం ప్రారంభించింది.
సరికొత్త పాఠాన్ని నేర్పి..
నేత కార్మికుల బాధలు కళ్లకు కట్టేలా రాజేశ్వరి రచనలు సాగించారు. వరకట్న వేధింపులు, అత్యాచారాలు, ఆత్మవిశ్వాసం, స్నేహం, జీవితంపై కవిత్వాలు రాశారు. సాహిత్యసేవకు అంగవైకల్యం అడ్డురాదని నిరూపించారు. అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్నా.. సమయం వృథా చేసేవారికి రాజేశ్వరి సరికొత్త పాఠాన్ని నేర్పించారు.
బుర్ర రాజేశ్వరి గురించి తెలుసుకున్న సుద్దాల అశోక్‌తేజ.. స్వయంగా సిరిసిల్లకు వచ్చి అభినందించారు. సిరిసిల్ల రాజేశ్వరిగా పేరుపెట్టి.. ఆమె కవితలకు పుస్తక రూపం ఇచ్చారు. అప్పటినుంచి రాజేశ్వరి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం రాజేశ్వరి జీవితాన్ని.. 12వ తరగతి తెలుగు సిలబస్‌లో ఓ పాఠ్యాంశంగా చేర్చింది. శరీరం సహకరించకపోయినా కవితలు రాస్తూ పేరు తెచ్చుకోవడంపై ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తన జీవితాన్ని మహారాష్ట్రంలో పాఠ్యాంశంగా చేర్చడంపై రాజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.
అంగవైక్యల్యంతో కుంగిపోకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న బుర్ర రాజేశ్వరి.. మహిళా దినోత్సవం వేళ స్త్రీలోకానికి నిజమైన స్ఫూర్తి.
అంగవైకల్యం అడ్డుకాదని.. కాళ్లనే చేతులుగా మార్చుకుని ఇదీ చూడండి:వ్యక్తిగత బాగోగుల విషయంలో వెనకబడిపోతే ఎలా...?